కుక్కకు విగ్రహం కట్టించారా? ఎవరు కట్టించారు? ఏంటా స్టోరీ?

dogs
శ్రీ| Last Updated: బుధవారం, 26 ఆగస్టు 2020 (20:45 IST)
కుక్కలు మనుషుల పట్ల విశ్వాసంతో ఉంటాయని చూసాం... విన్నాం.. కానీ మనుషులు కూడా అదే కుక్కలపై విశ్వాసంగా ఉంటారని ఎక్కడో వింటుంటాం. మనుషుల మధ్య మానవతా విలువలు అంతరించిపోతున్న సమయంలో ఎంతో ప్రేమగా పెంచుకున్న శునకం చనిపోతే ఏకంగా విగ్రహం కట్టించి నిరంతరం పూజలు నిర్వహిస్తుందో కుటుంబం. పూజలు ఏంటి ...? శునకానికి విగ్రహం ఏంటి..? ఇదంతా ఎక్కడ జరిగిందంటారా?

జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బర్తీపూర్ గ్రామానికి చెందిన గంగారాం తనకు చేదోడుగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో ఇంటి దగ్గర ఓ శునకాన్ని పెంచుకున్నాడు. ఆ శునకానికి మల్లయ్య అని నామకరణం చేసి ఎంతో అపురూపంగా చూసుకునేవాడు. ఆ శునకం కూడా అదే విశ్వాసంతో అతని ఇంటికి, వ్యవసాయ భూమికి, పశువులకు నిరంతరం కాపలా ఉండేది. దీంతో గంగారాంకు ఆ శునకానికి మధ్య అనుబంధం పెరిగింది. అంతేకాకుండా... ఆ శునకానికి రోజు ఆహారం తినిపిస్తూ తన పంటపొలాల వద్దకు తీసుకెళ్లెవాడు.

ఓ రోజు గంగారం తోటలో ఉన్నప్పుడు కోతుల గుంపు అతనిపై మూకుమ్మడిగా దాడి చేసాయి. ఆ దాడిలో అతను గాయపడ్డాడు. అక్కడే ఉన్న శునకం తన యజమానికి ఆపద వచ్చిందని గ్రహించి ఆ వానరాలపై గట్టిగా అరవటం మొదలు పెట్టింది. కంగారుపడ్డ వానరాలు అక్కడి నుండి వెంటనే వెళ్లిపోయాయి. స్వల్ప గాయాలతో ఇంటికి వచ్చిన గంగారాం తన ప్రాణాలను తన కాపాడిందని తన కుటుంబం సభ్యులతో చెప్పాడు.

ఇలా రోజురోజుకూ శునకానికి రైతు గంగారాంకు మధ్య అనుబంధం బలపడుతూ వచ్చింది. నాపై ఉన్న విశ్వాసంతో నా ప్రాణమే కాపాడింది. ఇక నా కుటుంబాన్ని సైతం కంటికి రెప్పలా కాపాడుతుంది అనుకున్నాడు. అయితే ఒకానొక రోజు గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని అందరికి ఇబ్బందికరంగా ఉందని కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు మందు పెట్టారు. దీంతో ఆ మందు తిని ఊర్లో ఉన్న కుక్కలతో పాటు గంగారాం కుక్క కూడా చనిపోయింది.

ఎంతో ప్రేమగా చూసుకునే శునకం చనిపోవడంతో ఎంతో బాధపడి కుమిలిపోయాడు రైతు గంగారాం. దాంతో తన శునకం శారీరకంగా లేకున్నా కలకాలం కనిపించాలన్న ఉద్దేశ్యముతో నిర్ణయం తీసుకున్నాడు. అంతేకాదు ఒకవేళ తాను మరణిస్తే మరణించిన రోజు నన్ను ఎలాగైతే గుర్తుచేసుకుంటారో ఆ శునకాన్నీ కూడా
గుర్తుచేసుకోవాలని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో ఆ శునకానికి జ్ఞాపకంగా ఉండేందుకు ఇంటి వెనుకాల అంత్యక్రియలు నిర్వహించి ఏకంగా విగ్రహం పెట్టాడు.

విగ్రహాన్ని పెట్టడమే కాదు ప్రతీ ఆదివారం విగ్రహానికి పూజలు చేసి ఉపవాసం కూడా ఉండేవాడు గంగారాం. అయితే గంగారాం వయసు పైబడటంతో అనారోగ్యంకు గురై
క్షీణించి ఆయన కూడా మరణించాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన కుటుంబ సభ్యులు అదేవిధముగా ప్రతీ ఆదివారం కుక్క విగ్రహానికి పూజలు చేస్తూ ఉపవాసం ఉంటున్నారు.

మనుషులకే సమాధులు కట్టలేని ఈ సమాజంలో శునకానికి విగ్రహం కట్టి పూజలు చేస్తున్న వీరిని గ్రామస్థులు అందరూ అభినందిస్తున్నారు. మొత్తానికి మనుషుల మధ్య మానవతా విలువలు అంతరించిపోతున్న ఈరోజుల్లో ఎంతో ప్రేమగా పెంచుకున్న ఆ శునకానికి విగ్రహం కట్టి ప్రేమను చాటుకున్నాడు.దీనిపై మరింత చదవండి :