గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (11:03 IST)

ప్రేమను తిరస్కరించిందనీ.. యువతి ఇంటికి నిప్పు

ఇటీవలి కాలంలో ఏకపక్ష ప్రేమలు పలు దుశ్చర్యలకు దారితీస్తున్నాయి. కొందరు  భగ్నప్రేమికులు దారుణమైన నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువతి తన ప్రేమను తిరస్కరించిందన్న అక్కసుతో ఆమె ఇంటికి ప్రియుడు నిప్పు పెట్టాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీజేఆర్ నగర్, మల్లికార్జునా నగర్ కాలనీలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానికంగా నివాసం ఉండే నవీన్ అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఆ యువతి వెంటపడుతూ వేధించసాగాడు. నవీన్ మత్తుకు బానిసై చిల్లరగా తిరుగుతూ తన కూతురు వెంటపడుతున్నాడని యువతి తల్లిదండ్రులు గమనించి, నవీన్‌ను మందలించారు.
 
దీంతో కక్ష పెంచుకున్న నవీన్ వాళ్ల అంత చూస్తానని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో యువతి ఇంటిని ఎవరు లేని సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో బాధితుల ఇంటితో పాటు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనపై బాధితులు జవహర్ నగర్ పోలీసులను ఆశ్రయించగా ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. వెంటనే నిందితుడు నవీన్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్ నిమిత్తం చర్లపల్లి జైలుకు తరలించారు.