1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 అక్టోబరు 2021 (14:25 IST)

అప్పు తీర్చేందుకు రూ.2 వేలు లేదని వ్యక్తి ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం పొన్నాల్‌లో ఓ విషాధ ఘటన జరిగింది. అప్పు తీర్చేందుకు రూ.2 వేలు సమకూరలేదని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. పొన్నాల్‌‌కు చెందిన మర్యాల ఆనంద్‌(23) తుర్కపల్లిలోని ఓ బయోటెక్‌ సంస్థలో వర్క్ చేస్తున్నారు. మూడు నెలల క్రిందట సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం ప్రజ్ఞాపూర్‌కు చెందిన కుంచెరుకలి వద్ద రూ.10 వేలు అప్పు తీసుకున్నాడు. 
 
తాజాగా అప్పును తీర్చాలని ఓ మహిళతో పాటు మరో ఐదుగురు ఈ నెల 22న పొన్నాలలోని ఆనంద్‌ ఇంటికి వచ్చారు. అయితే తన వద్ద ఇప్పుడు డబ్బు లేదని.. త్వరలో సమకూరుస్తానని చెప్పాడు. అయినా వారు వినలేదు. తీవ్రంగా ఒత్తిడి చేశారు. 
 
కనీసం రూ.2 వేలు ఇస్తే కొత్త నోటు రాసుకొని వెళ్తామని మొండికేసి కూర్చున్నారు. దీంతో రెండు వేలు కోసం ఆనంద్‌ తనకు తెలిసిన చాలామందిని అడిగాడు. ఎవరూ ఇవ్వడానికి ముందుకు రాలేదు.
 
కుంచెరుకలి అతనితో వచ్చినవారు డబ్బు ఇచ్చే వరకు వెళ్లేది లేదని అతడి ఇంటి వద్దే భీష్ముంచుకు కూర్చున్నారు. చివరకు డబ్బు ఇచ్చే వరకు తమతో పాటు రావాలని చెప్పగా శనివారం రోజు తుర్కపల్లి వరకు వెళ్లాడు.
 
ఆ తర్వాత ఇంటికొచ్చిన ఆనంద్‌ రూ.2 వేల కోసం తనను ఎవరూ నమ్మలేదని మనస్తాపంతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని తనువు చాలించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.