వైద్య విద్యార్థిన ప్రీతిది ఆత్మహత్యే : వరంగల్ సీపీ రంగనాథ్
కాకతీయ వైద్య కాలేజీకి చెందిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతిది ఆత్మహత్యేనని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఆమె విషపు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పారు. తాజాగా వచ్చిన ప్రీతి శవపరీక్ష నివేదికను పరిశీలించి మీడియాకు వివరాలను వెల్లడించారు.
అయితే, ప్రీతి ఆత్మహత్యకు సీనియర్ విద్యార్థి సైఫ్ ప్రధాన కారణమని సీపీ తెలిపారు. వారం పది రోజుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని చెప్పారు. సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని మృత్యువుతో పోరాడుతూ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచింది.
పీజీ మత్తు వైద్యం (అనస్థీషియా) ఫస్టియర్ చదువుతున్న ప్రీతిని.. సీనియర్ విద్యార్థి సైఫ్ కొన్నాళ్లుగా వేధిస్తుండటంతో హానికరమైన ఇంజెక్షన్ చేసుకుంది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ప్రీతికి తొలుత వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకొచ్చారు. ఆమె ప్రాణాలు కాపాడేందుకు నిమ్స్ వైద్యుల బృందం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయంగా మారడంతో, రాజకీయంగానూ దుమారం రేపడంతో వైద్య ఆరోగ్యశాఖ చర్యలకు దిగింది. వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలోని మత్తుమందు (అనస్థీషియా) ప్రొఫెసర్, విభాగాధిపతి కె.నాగార్జున రెడ్డిని బదిలీ చేసింది. ఆయన్ని భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాల అనస్థీషియా ప్రొఫెసర్‌గా పంపిస్తూ వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.