గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 మార్చి 2023 (13:25 IST)

ప్రశ్నపత్రం లీకేజీకి పాల్పడితే పదేళ్ల జైలు.. ఎక్కడ?

tspsc logo
భవిష్యత్‌లో వివిధ రకాల పోటీ పరీక్షల కోసం నిర్వహించే ప్రశ్నపత్రాలను లీక్ చేస్తే అలాంటి వారిని కఠినంగా శిక్షించనున్నారు. ఇందుకోసం ఓ సమగ్ర చట్టం తీసుకుని రానున్నారు. ఈ చట్టంలో ప్రశ్నపత్రం లీకేజీకి పాల్పడితే పదేళ్ల జైలుతో పాటు ఆ వ్యక్తి ఆస్తులు సీజ్ చేయడం వంటి చర్యలు చేపడుతారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ సమిషన్ (టీఎస్ పీఎస్సీ) నిర్వహించిన పలు పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఆ సంస్థలో పని చేసే ఉద్యోగి ఒకరు లీక్ చేశారు. దీంతో పలు పరీక్షలను టీఎస్ పీఎస్సీ రద్దు చేసింది. 
 
ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో ఎవరైనా ప్రశ్నపత్రం లీకేజీకి పాల్పడితే ఇక అంతే సంగతులు. పదేళ్లపాటు జైలు శిక్షతో పాటు భవిష్యత్‌లో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగానికి పనికిరాకుండా అనర్హత వేటు వేయనున్నారు. అలాగే, భారీ అపరాధంతో పాటు ఆస్తులు జప్తును కూడా చేపట్టనున్నారు. ఈ దిశగా ఒక సమగ్ర చట్టం రూపకల్పన దిశగా టీఎస్ పీఎస్సీ భావిస్తుంది. 
 
పేపర్ లీకేజీని ప్రోత్సహించినా, సహకరించినా, లీకైన పేపర్‌తో పరీక్ష రాసినా అందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే, ఇలాంటి పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీకేజీ కావడం ఇది కొత్తేమి కాదు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలు లీకయ్యాయి కూడా. ఆ రాష్ట్రాలు కొన్నిచట్టాలు చేసినప్పటికీ ఫలితాలు మాత్రం నామమాత్రంగా కనిపిస్తున్నాయి.