మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 14 అక్టోబరు 2020 (21:13 IST)

గిరిజనులకు ఎలాంటి నష్టం జరగదు: తెలంగాణ మంత్రి సత్యవతి

ఏజన్సీ ప్రాంతాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల నమోదు విషయంలో గిరిజనులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు.

కొంతమంది ప్రతిపక్ష నేతలు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తూ గిరిజనులను రెచ్చగొడుతున్నారని, వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఏజన్సీ చట్టాల మేరకే వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల నమోదు జరుగుతుందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ శాసనసభలో స్వయంగా ప్రకటించారని తెలిపారు.

ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలున్న వారికి ప్రభుత్వ పథకాలు రైతుబంధు, రైతు బీమా, ఇతర పథకాలు కొనసాగుతాయని హామీ ఇచ్చారని చెప్పారు.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి కూడా గిరిజనుల పట్ల, ఏజన్సీ చట్టాల పట్ల సంపూర్ణ అవగాహన ఉందని, ఆస్తుల నమోదు వల్ల ఎవరికీ నష్టం లేదని హామీ ఇచ్చిన అంశాన్ని గుర్తు చేశారు. 

సాదా బైనామాలు గతంలో అవకాశం ఇచ్చినప్పుడు కొంతమంది దీనిని వినియోగించుకోలేకపోయినందున వారి విజ్ణప్తి మేరకు సిఎం కేసిఆర్ మరోసారి అవకాశం ఇచ్చారన్నారు. ఈ సాదా బైనామాల వల్ల గిరిజనుల భూమికి ఎలాంటి నష్టం జరగదన్నారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా గిరిజనుల హక్కులను కాపాడుతామని, పోడు భూములకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షాల కొంతమంది నేతల  మాటలు నమ్మి ఆందోళన చెందవద్దని కోరారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసిఆర్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని, వారి నాయకత్వంలో గిరిజనులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు.