సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (22:31 IST)

జోరు వానలోనూ రేవంత్ మాటల తూటాలు.. స్పీచ్ అదరగొట్టిన టైగర్

దళితబంధు పథకం కింద ఇస్తున్న 10 లక్షలు కేసీఆర్ పెడుతున్న భిక్ష కాదని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. పన్నుల రూపంలో ప్రజలు కట్టిన సొమ్మునే పంచుతున్నాడని ఆయన అభిప్రాయపడ్డారు. రావిరాల గడ్డ మీద జోరు వానలోనూ రేవంత్ మాటల తూటాలతో హోరెత్తించారు. ఇంద్రవెళ్లిలో తొలి అడుగు వేసిన కాంగ్రెస్ పార్టీ రావిరాలలో మలి అడుగు వేయగా, మరో అడుగు కేసీఆర్ నెత్తిమీద వేస్తామని వ్యాఖ్యానించారు.
 
వర్షంలో తడుస్తూనే రేవంత్‌రెడ్డి తన ప్రసంగం కొనసాగించారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, సీనియర్‌ నేతలు మల్లు రవి, కోదండరెడ్డి, దాసోజు శ్రవణ్‌, అద్దంకి దయాకర్‌ తదితరులు బహిరంగ సభకు హాజరయ్యారు. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్‌ శ్రేణులతో రావిర్యాల జనసంద్రంగా మారింది.
 
18 నెలల్లో కేసీఆర్‌ను గద్దె దించాలని ఉద్యమకారులు ఆవేశంగా ఉన్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని రావిర్యాలలో 'దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా' బహిరంగ సభ కొనసాగుతోంది. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు కింద ఇచ్చే రూ.10 లక్షలు ఎవరి భిక్షం కాదని.. ప్రజలు పన్నుల రూపంలో ఇచ్చిన సొమ్మునే మళ్లీ వాళ్లకు తిరిగి ఇస్తున్నారని తెలిపారు. ఓట్ల అవసరమైతేనే కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తాడని ఎద్దేవా చేశారు.
 
కేసీఆర్‌ను దెబ్బకొట్టే అవకాశం ప్రజలకు దక్కిందని.. తెలంగాణ 4 కోట్ల ప్రజల భవిష్యత్ ఇప్పుడు హుజూరాబాద్ బిడ్డల చేతిలో ఉందని అన్నారు. కాంగ్రెస్‌ సభలు చూసి కేసీఆర్‌ గుండెల్లో గునపం దిగినట్లు ఉందన్నారు.
 
ప్రణబ్ ముఖర్జి వచ్చినప్పుడు, మాజీ గవర్నర్ నరసింహన్ కనిపించినప్పుడు కేసీఆర్ వాళ్ల కాళ్లు మొక్కుతాడని కానీ దళిత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వచ్చినప్పుడు కనీసం నమస్కారం కూడా చేయలేదు అన్నారు. 
 
మొదటి సీఎస్ రాజీవ్ శర్మ, తర్వాత సీఎస్ ఎస్కే జోషి, మొదటి డీజీపీ అనురాగ్ శర్మ ఈ ముగ్గురి పదవులను మూడుసార్లు పొడిగించారని చెప్పారు. ఇప్పుడు వారిని ప్రభుత్వ సలహాదార్లుగా నియమించుకున్నారు కాని ఒక దళిత బిడ్డ ప్రదీప్ చంద్ర సీఎస్ అయితే ఒకటే నెలకు రిటైర్మెంట్ ఇచ్చారన్నారు. ఇదే కేసీఆర్ దళితుల పట్ల ఉన్న గౌరవం అని ప్రశ్నించారు. భూపాలపల్లి కలెక్టర్గా ఉన్న మురళి పేదల గురించి మాట్లాడితే అతన్ని అవమానించారన్నారు. ఆయన రాజీనామా చేసి బయటకు వెళ్లారని తెలిపారు.