శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 ఆగస్టు 2021 (09:32 IST)

ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలు : వీర జవాన్లకు ప్రణామాలు

భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి మాట్లాడుతూ..  జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. దేశం కోసం సరిహద్దులో కాపలా కాస్తున్న వీర జవాన్లకు మోదీ ప్రణామాలు అర్పించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన త్యాగధనులను దేశం స్మరించుకుంటోందన్నారు.
 
కరోనా సంక్షోభం వేళ వైద్యులు, సిబ్బంది అందించిన సేవలను మోదీ కొనియాడారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వారు చేసిన కృషి గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. 
 
ఇక, టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి పతకాలు అందించిన క్రీడాకారులపై మోదీ ప్రశంసలు కురిపించారు. దేశానికి వారు పతకాలు మాత్రమే అందించలేదని, యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. వారందరికీ దేశం యావత్తూ గౌరవం ప్రకటిస్తోందన్నారు.
 
విభజన సమయంలో దేశ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, బాధలకు గౌరవ సూచకంగా ఆగస్టు 14న ‘విభజన భయానక జ్ఞాపక దినం’ గా జరుపుకోవాలని మోదీ సూచించారు. కొవిడ్‌తో దేశ ప్రజలు సహనంతో పోరాడారని మోదీ పేర్కొన్నారు. 
 
ఈ సమయంలో అనే సవాళ్లను ఎదుర్కొన్నామని, అసాధారణ వేగంతో పనిచేశామని గుర్తు చేశారు. ఇది మన పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు అందించిన బలమని అన్నారు. భారతదేశం నేడు టీకాల కోసం ఏ ఇతర దేశంపైనా ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు.