శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 17 జులై 2021 (16:24 IST)

అహంకారాన్ని ఓడించేందుకు జరుగుతున్న ఎన్నికలు : ఈటల రాజేందర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆ పార్టీ నుంచి వైదొలగిన మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను రాజీనామా చేసిన హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలు న్యాయం, ధర్మాన్ని కాపాడుకోవడానికి, అహంకారాన్ని ఓడించడానికి జరుగుతున్న ఎన్నిక అని ఆయన అన్నారు. 
 
తెరాస ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేసినా గెలిచేది బీజేపీనే అని చెప్పారు. కేవలం హుజూరాబాద్ నియోజకవర్గంలోనే కాకుండా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ వ్యతిరేకత ఉందన్నారు. చిల్లర రాజకీయాలను తెలంగాణ ప్రజలు అంగీకరించరని చెప్పిన ఈటల... ప్రజల్లో బలం ఉందని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు ఎందుకు చేస్తోందని మండిపడ్డారు. 
 
హుజూరాబాద్‌లో కోట్లాది రూపాయలను తెరాస ఖర్చు చేస్తోందని.. కుల సంఘం భవనాలను కట్టిస్తామంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని ఈటల మండిపడ్డారు. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా తెరాసను ప్రజలు నమ్మబోరని... ఈటల రాజేందర్‌ను కేసీఆర్ మోసం చేశాడని ప్రజలు అనుకుంటున్నారన్నారు. యావత్ తెలంగాణ ప్రజలు హుజూరాబాద్ ఉపఎన్నిక వైపు చూస్తున్నారన్నారు. ఆత్మగౌరవాన్ని గెలిపించుకుందామని హుజూరాబాద్ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
 
తెలంగాణలో ఎస్సీల జనాభా 17 శాతం వరకు ఉందని... కానీ మంత్రి వర్గంలో వారి ప్రాతినిధ్యం చాలా దారుణంగా ఉందని ఈటల విమర్శించారు. కేవలం 0.5 శాతం మాత్రమే ఉన్న కులాల వారు ప్రభుత్వంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ఈటల రాజేందర్  గుర్తుచేశారు.