1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (09:11 IST)

ఇప్పటికైనా కేసీఆర్ ను ఇంటికి పంపించండి ప్లీజ్: విజయశాంతి

ఇప్పటికైనా కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడాలని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని ఆ పార్టీ మహిళా నేత విజయశాంతి పిలుపునిచ్చారు.
 
ఓవైపు మనది ధనికరాష్ట్రం అని సర్కారు గొప్పలు చెప్పుకుంటోందని, అదే సమయంలో రాష్ట్రంలో పేదల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని, ఇదెలాగో ప్రభుత్వం వెల్లడించాలని స్పష్టం చేశారు. జీఎస్ డీపీలో దేశంలోనే తెలంగాణ 5వ స్థానంలో ఉందని, సర్ ప్లస్ స్టేట్ అని ఆర్థికశాఖ చెబుతోందని, కానీ అదే సమయంలో పౌరసరఫరాల శాఖ జారీ చేసే రేషన్ కార్డులకు పొంతన కుదరడంలేదని విజయశాంతి వ్యాఖ్యానించారు.
 
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల వివరాలు ప్రకటించడం చూస్తుంటే గత ఏడేళ్లలో రాష్ట్రంలో పేదల సంఖ్య ఎక్కువైనట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో 71 శాతానికి పైగా పేదరికంలో మగ్గుతున్నట్టు వెల్లడైందని తెలిపారు. అలాంటప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రమని, దేశాభివృద్ధికి తామే నిధులు ఇస్తున్నామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో గారడీ మాటలు చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు.
 
కేసీఆర్ ధనిక తెలంగాణ అప్పుల లెక్క గతంలో రూ.70 వేల కోట్లు ఉంటే, ఇప్పుడది రూ.4 లక్షల కోట్లకు చేరిందని ఎద్దేవా చేశారు. గడచిన 5 నెలల్లోనే రూ.6,800 కోట్ల మిత్తి కడుతున్నారని ఆరోపించారు. ధనిక రాష్ట్రం అంటూనే ప్రజలను దారిద్ర్యరేఖకు దిగువన పడేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రగతి కోసం చేస్తున్నది శూన్యమని విమర్శనాస్త్రాలు సంధించారు.