గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

కోడిపుంజును అరెస్టు చేసి లాకప్‌లో ఉంచిన ఖాకీలు... ఎక్కడ!

cock
తెలంగాణ రాష్ట్రంలో జడ్చర్ల పోలీసులు చాలా పక్కాగా విధులు నిర్వహిస్తున్నారు. తమ విధి నిర్వహణలో భాగంగా, తప్పు చేసిన ఓ కోడిపుంజును కూడా అరెస్టు చేసి స్టేషన్ లాకప్‌లో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు విస్తుపోతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బూరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఓ బాలుడు కోడిపుంజును తీసుకెళ్తుండగా.. గమనించిన స్థానికులు చోరీ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసు సిబ్బంది వచ్చి బాలుడితో పాటు కోడిపుంజును ఠాణాకు తీసుకొచ్చారు. నిందితుడు మైనర్‌ కావటంతో తల్లిదండ్రులకు పిలిపించి వారికి అప్పగించారు. 
 
కోడిపుంజు ఎవరిదో తెలియలేదు. పైగా, ఎవరి నుంచీ ఫిర్యాదు రాలేదు. కోడిపుంజు బయట ఉంటే కుక్కలు దాడిచేసే అవకాశముందని భావించిన సీఐ రమేశ్‌బాబు దాన్ని లాకప్‌లో పెట్టి ఆహారం అందిస్తున్నారు. ఠాణాకు వెళ్లినవారంతా లాకప్‌లో ఉన్న కోడిపుంజును ఆసక్తిగా చూశారు. సీఐని వివరణ కోరగా భద్రత కల్పించేందుకే లాకప్‌లో పెట్టినట్లు చెప్పారు.