బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (10:22 IST)

మూసీ - హుస్సేన్ సాగర్‌లలో తగ్గుతున్న కాలుష్యం

హైదరాబాద్ నగరంలోని ఉన్న మూసీ నదితో పాటు హుస్సేన్ సాగర్‌లో కాలుష్య స్థాయి క్రమంగా తగ్గుతుందని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్ పీసీబీ), హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బి) అధికారులు వెల్లడించారు. 
 
ముూసీ, హుస్సేన్ సాగర్‌లతో పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న నీటి వనరులు కాలుష్యం బారినపడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. ముఖ్యంగా, మూసీ నది, హుస్సేన్ సాగర్‌లలో కాలుష్యం స్థాయి చాలా మేరకు తగ్గినట్టు అధికారులు వెల్లడించారు. 
 
వీరు వెల్లడించిన వివరాల మేరకు సేంద్రీయ పదార్థాలు కుళ్లిపోయేటపుడు బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు వినియోగించే ఆక్సిజన్ పరిమాణాన్ని సూచించే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ స్థాయి మూసీ నదిలో బాగా తగ్గిందని తెలిపారు. 2014లో బావోడీ 58 ఎంజీ పర్ లీటర్‌ చొప్పున ఉండగా, అది ప్రస్తుతం 22 ఎంజీ పర్ లీటర్‌గా ఉందని వివరించారు. 
 
ఇదే అంశంపై నేషనల్ గ్రీన్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో ఈ యేడాది విస్తారంగా వర్షాలు కురిశాయి. ఫలితంగా హుస్సేన్, మూసీ నదుల్లో నీటి మట్టాలు బాగా పెరిగాయి. పైగా, వీటిలోకి వచ్చే మురుగు నీటిని శుద్ధి చేసి విడుదల చేసేలా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ కారణంగానే కాలుష్యం స్థాయి తగ్గిందని ఆయన వెల్లడించారు.