గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (16:21 IST)

కేటీఆర్ అహంకారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారు: పొంగులేటి సుధాకరరెడ్డి

మంత్రి కేటీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాల్సిన విషయాన్ని మర్చిపోవద్దని హితవు పలికారు.

మంత్రి కేటీఆర్ అహంకారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వరంగల్‌లో కేటీఆర్ విచక్షణ కోల్పోయి, అసహనంతో మాట్లాటాన్ని ఖండిస్తున్నామన్నారు. తెలంగాణలో అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా.. కేసీఆర్ రాజ్యాంగం నడుస్తోందని పొంగులేటి సుధాకరరెడ్డి  దుయ్యబట్టారు. టీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే.. బీజేపీ కచ్చితంగా ప్రశ్నిస్తోందన్నారు.
 
కేటీఆర్ తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.  కేటీఆర్ భాష తెలంగాణకే అవమానకరమన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలపై కేటీఆర్ తన స్థాయికి మించి మాట్లాడాడని చెప్పారు. కేటీఆర్ బెదిరిస్తే.. బీజేపీ మరింత గట్టిగా ఎదుర్కొంటోందన్నారు.

కేంద్రం ఇచ్చిన నిధులపై టీఆర్ఎస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏమైందో కేటీఆర్ చెప్పాలని నిలదీశారు. బయ్యారం స్టీల్ ఫ్లాంట్‌పై టాస్క్‌ఫోర్స్ కమిటీ రిపోర్ట్‌ను బయటపెట్టాలని పొంగులేటి సుధాకరరెడ్డి డిమాండ్ చేశారు.