తెలంగాణలో పిడుగుపడి ఆరుగురు మృతి
తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈదురు గాలులు, పిడుగులు, వడగండ్లతో కూడిన అకాల వర్షం కురిసింది. ఈ అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ధాన్యం తడిసిపోయింది. కొందరు మృతి చెందగా, కొన్ని చోట్ల మూగజీవాలు మృతి చెందాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పరిధిలోని లింగోజిగూడెం గ్రామానికి చెందిన రైతు దంపతులు సోమవారం పిడుగుపాటుకు మృతి చెందారు. బండారు కరుణాకర్‌రెడ్డి (65), ఆయన భార్య వేణమ్మ (55) సోమవారం సాయంత్రం వ్యవసాయ బావి వద్ద గేదెకు పాలు తీసేందుకు వెళ్లగా, వర్షం పడుతుండగా, చింతచెట్టు కిందకు వెళ్లారు.
చెట్టుపై పిడుగు పడటంతో దంపతులిద్దరు అక్కడికక్కడే మరణించారు. పాడిగేదె కూడా మృతి చెందింది.
సోమవారం సాయంత్రం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామానికి చెందిన మన్నె రాములు (70) మామిడి చెట్టు కింద నిలబడగా, పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
అకాల వర్షం కారణంగా మార్కెట్ యార్డుల్లో ఉంచిన ధాన్యం సైతం పూర్తిగా తడిసిపోయింది. ఆత్మకూరు (ఎం) లో పిడుగుపడటంతో ధనబోయిన యాదయ్యకు చెందిన ఓ గేదె, ఆరు గొర్రెలు మృతి చెందాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో పిడుగు పాటుకు ముగ్గురు వ్యక్తులు మరణించారు. పదుల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామానికి చెందిన సంబాగ రామయ్య (60) పొలం వద్ద పనులు చేస్తుండగా, వర్షం రావడంతో చెట్టు కిందకు వెళ్లాడు. అదే సమయంలో పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
రాయపోలు మండలంలోని మంతూరులో పొలం పనులు చేస్తున్న పట్నం నర్సింహులు (32) పిడుగు పడి మరణించాడు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేటలో పిడుగు పాటుకు ఇటుక బట్టి కార్మికుడు దొగ్రి ఈశ్వర్ (40) మృతి చెందాడు. మరో కార్మికుడు సంజరు అపస్మారక స్థితికి చేరుకోగా, ఆస్పత్రికి తరలించారు.
తోగుట మండలంలోని వెంకట్రావుపేటకు చెందిన మిద్దె లక్ష్మీ, భీమరి ఎల్లవ్వ, బెస్త వెంకటవ్వ, బెజ్జరమైన సుజాత వ్యవసాయ పనులకు వెళ్లారు. వర్షం రావడంతో సమీపంలోని ట్రాక్టర్ ట్రాలీ కిందకు వెళ్లాడు. అదే సమయంలో పిడుగుపడటంతో ట్రాలీకి విద్యుత్ సరఫరా అయి సొమ్మసిల్లిపడిపోయాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ముత్యంపేట, ముబరాస్‌పర్ గ్రామాల్లో పిడుగుపాటుతో 3 పశువులు మృతి చెందాయి. గొల్లపల్లిలో పిడుగు పాటుకు 15 మేకలు మృతి చెందాయి. చేర్యాల మండలం గుర్జకుంటలో పిడిగుపడి 5 మేకలు మృత్యువాత పడ్డాయి.