గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (22:32 IST)

భర్త వేధింపులు తాళలేక.. ఏడు నెలల గర్భిణి.. ఒంటిపై శానిటైజర్ పోసుకుని..?

భర్త వేధింపులు తట్టుకోలేక ఏడు నెలల గర్భిణి సిరిపురం అనూష (32) అనే మహిళ ఒంటిపై శానిటైజర్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై అభినవ్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీకకి చెందిన సిరిపురం సంతోష్ అనే సింగరేణి కార్మికునికి సంవత్సరం క్రితం అనూషతో వివాహం జరిగింది.
 
కొంత కాలం వీరి సంసారం సాఫీగానే సాగినప్పటికి భర్త సంతోష్ గత కొన్ని నెలలుగా రోజు తాగి వచ్చి భార్య అనూషను వేధింపులకు గురి చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో గురువారం సంతోష్ యధావిధిగానే తాగి వచ్చి అనూషను కొట్టడంతో మనస్తాపానికి గురైన అనూష ఇంట్లో ఉన్న శానిటైజర్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.
 
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలో ని ప్రధాన్ దవాఖానకు తరలించారు. వైద్యులు ఎలాంటి ప్రాణహాని లేదని తెలిపారన్నారు. అనూష సోదరుడు బొద్దుల మల్లయ్య ఫిర్యాదు మేరకు సంతోష్ పై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.