శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 జూన్ 2020 (09:58 IST)

నేటి నుంచి పీవీ శతజయంతి వేడుకలు : ఒక యేడాది పాటు...

బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లుచేసింది. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 10.30 గంటలకు పీవీ శత జయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తారు. 
 
ముందుగా పీవీ ఘాట్‌ వద్ద సీఎం పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటుచేసిన వేదిక వద్ద సర్వమత ప్రార్థనలు, భజనలు, సంకీర్తనలు జరుగుతాయి. అనంతరం సభాకార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పీవీ కుటుంబసభ్యులు, శతజయంతి ఉత్సవ కమిటీ చైర్మన్‌ కే కేశవరావు పాల్గొంటారు.
 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగిస్తారు. కొవిడ్‌-19 దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే అతిథులకు అనుమతిస్తున్నారు. పీవీ కీర్తి దశదిశలా చాటేలా దేశ విదేశాల్లో ఉత్సవాలను నిర్వహించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలమేరకు ఏర్పాట్లు జరిగాయి. ఏడాదిపాటు పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణ బాధ్యతను పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావుకు అప్పగించారు. 
 
ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ దేశ విదేశాల్లో పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై ఆయా దేశాల్లోని తెలుగువారితో మాట్లాడారు. ఇతర రాష్ర్టాల్లో కూడా ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శతజయంతి ఉత్సవాల నిర్వహణను రాజ్యసభ సభ్యుడు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కే కేశవరావు అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ పర్యవేక్షిస్తున్నది. 
 
కాగా, పీవీ జయంతిని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఓ ట్వీట్ చేశారు. రాజనీతిజ్ఞత, సౌమ్య మనస్తత్వం, స్థితప్రజ్ఞత, సాహితీ ప్రతిభ ఇలా అనేక ఉన్నత లక్షణాల అరుదైన ముద్ర శ్రీ పీవీ నరసింహారావు సొంతం. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా, స్థిమితంగా, ప్రశాంతంగా ఎదుర్కొనే ఆయన పనితీరు నుంచి నేటి యువత నేర్చుకోవలసింది ఎంతో ఉంది.
 
ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడే అనేక భూ సంస్కరణలు, విద్యా సంస్కరణలతో సంస్కరణవాదిగా ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఆయన, ప్రధాని అయిన తర్వాత జాతీయస్థాయిలోనూ అదే సంస్కరణల పర్వాన్ని కొనసాగించారు. ముఖ్యంగా కష్టకాలంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థకు చక్కని భవిష్యత్తు చూపించి, గాడిలో పెట్టేందుకు తీసుకొచ్చిన సంస్కరణలు దేశం మరచిపోదు. 
 
అలాగే, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకుని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ప్రపంచ దేశాలతో పోటీపడే స్థాయికి భారతదేశాన్ని తీర్చిదిద్దిన ప్రధానిగా పీవీ నరసింహారావు చరిత్రలో నిలిచిపోయారని బాబు తెలిపారు.  ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... "తన జాతి ప్రజలను సంక్షోభం నుండి గట్టెక్కించిన నాయకులను చరిత్ర మరచిపోదు. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్థికరంగానికి దిశానిర్దేశం చేసి, ప్రపంచదేశాలతో పోటీపడే స్థాయికి భారతదేశాన్ని తీర్చిదిద్దిన ప్రధానిగా పీవీ నరసింహారావుగారు చరిత్రలో నిలిచిపోయారు. 
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావు గారు చేపట్టిన భూసంస్కరణలు దళిత, బహుజన వర్గాల పురోగతికి ఎంతగానో దోహదం చేశాయి. రాజకీయవేత్తగానే కాకుండా సాహితీవేత్తగా కూడా తెలుగుజాతికి వన్నె తెచ్చారు పీవీ నరసింహారావు. అటువంటి తెలుగు ఆణిముత్యం పీవీ నరసింహారావుగారికి దేశ రాజధానిలో స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలంటూ తెలుగుదేశం హయాంలో 2014లో రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. 
 
ఫలితంగా ఆయన మరణించిన పదేళ్ళకు ఢిల్లీలోని ఏక్తాస్థల్ వద్ద పీవీ స్మారక చిహ్నం నిర్మించబడింది. ఆర్థిక సంస్కరణలతో  దేశ గమనాన్ని ప్రగతిపూర్వక మలుపు తిప్పిన పీవీ నరసింహారావుగారికి భారతరత్న ఇవ్వడం సముచితం. ఈరోజు పీవీ జయంతి సందర్భంగా దేశానికి, తెలుగువారికి, సాహితీ లోకానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులర్పిస్తున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.