శనివారం, 13 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

తెలంగాణా రాష్ట్రంలో నేడు రేపు వర్షాలు

daimond rain
తెలంగాణా రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు తెలంగాణాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంపై 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడివుందని దీని నుంచి కర్నాటక వరకు గాలుల్లో ఏర్పడిన అస్థిరత కారణంగా ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
మరోవైపు, కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ముఖ్యంగా, వడగాలుల వీచే అవకాశం ఉండటంతో మధ్యాహ్న సమయంలో ప్రజలు బయటకురావొద్దని కోరింది. గత కొన్ని రోజులుగా తెలంగాణా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నెలకొంటున్న విషయం తెల్సిందే.