1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

తెలంగాణాలో మరో మూడు రోజుల పాటు వర్షాలు : వాతావరణ శాఖ

rain
తెలంగాణా రాష్ట్రంలో గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజుల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
 
ముఖ్యంగా ఆదిలాబాద్‌, కుమురం భీమ్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ కురిసే అవకాశందని తెలిపింది. దీంతో ఈ జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు 
 
మరోవైపు, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 
 
ఇదిలావుంటే, మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. సాయంత్రం నాటికి అత్యధికంగా కుమురం భీమ్‌లోని జైనూరులో 17.9 సెంటీమీటర్లు, కరీంనగర్‌లోని ఆర్నకొండలో 17.8 సెంటీమీటర్లు, పెద్దపల్లి జిల్లా కనుకులలో 117.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
 
కర్ణాటకలోని కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జోగులాంబ గద్వాల్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టులోకి స్థిరమైన ఇన్‌ఫ్లోలు వస్తున్నాయి. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి దిగువకు జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు.
 
అదేవిధంగా, రాష్ట్రంలోని ఉత్తర మరియు తూర్పు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి, ఫలితంగా గోదావరి నది పరీవాహక ప్రాంతంలోని వివిధ నీటిపారుదల ప్రాజెక్టులలోకి గణనీయమైన ఇన్‌ఫ్లోలు వస్తున్నాయి. శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులకు నిరంతరం ఇన్ ఫ్లో వస్తుండటంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.