శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 10 జులై 2021 (13:27 IST)

మూడుసార్లు ఎమ్మెల్యే... అయినా, గాడీ లేదు...బంగ్లా లేదు!

రాజ‌కీయ ప‌ద‌వి వ‌చ్చిందే... రాంగ్ రూట్లో మేసేయ‌డానికి అని భావిస్తున్న రోజులివి. అయినా ఈ రోజుల్లో ఇట్లాంటి నాయకులు ఉన్నారా? అనిపిస్తుంది. ఈ పెద్దాయ‌న‌ను చూస్తే. నిరాడంబరంగా క‌నిపిస్తున్న ఈయ‌న ఎవ‌రో కాదు... రామన్నపేట మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి. 
 
ఆదర్శవంతమైన రాజకీయ జీవితం.. నిరాడంబరతకు నిలువుటద్దం.. మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం.. అయినా, నేటికీ సొంత ఇల్లు, వాహనం లేవు. ఈ మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి వ‌య‌సు 88. ఇలా ఎవ‌రో ఇంటి అరుగుల‌పై కూర్చొన‌డం త‌ప్ప ఆయ‌న‌కంటూ సొంత ఇల్లు లేదు.
 
ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే చాలు, తరాలకు సరిపోయేలా ఆస్తులు కూడబెట్టుకుంటున్న రోజులివి.. కానీ, ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసి.. అనంతరం రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా వైదొలిగిన చరిత్ర యాద‌గిరి రెడ్డి.
 
పూర్వ నల్గొండ జిల్లాలోని రామన్నపేట నియోజకవర్గం నుంచి 1985, 1989, 1994లలో యాదగిరిరెడ్డి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. తొలిసారిగా ప్రజాప్రతినిధిగా ఎన్నికైన అనంతరం ఆయనకు వేతనంగా నెలకు రూ. 12 వేలు లభించేవి. 1994లో ఈ మొత్తం రూ. 15 వేలకు చేరింది.

యాదగిరిరెడ్డికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.. తన ముగ్గురు సంతానాన్ని సర్కారు బడిలోనే చదివించారు. మరో కుమార్తెను మాత్రం ప్రభుత్వ వసతి గృహంలో చేర్చారు. పెద్ద కుమారుడు రాజశేఖర్‌రెడ్డి ప్రస్తుతం న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తుండగా, చిన్న కుమారుడు రామ్మోహన్‌రెడ్డి పాత్రికేయుడిగా పనిచేస్తున్నారు. సీపీఐ తరఫున ఎమ్మెల్యేగా గెలవడంతో.. పార్టీ సిద్ధాంతాలను అనుగుణంగా క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా యాదగిరిరెడ్డి పనిచేశారు.

మూడోసారి ఎన్నికల్లో పోటీచేసేందుకు... అప్ప‌ట్లో చేతిలో డబ్బుల్లేకపోవడంతో ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని కూడా అమ్మివేశారు. ఇపుడు హైదరాబాద్‌లోని చంపాపేటలో రూ.5 వేలు చెల్లించి, అద్దె ఇంటిలో భార్యతో కలిసి ఉంటూ శేష జీవితాన్ని కొనసాగిస్తున్నారు. సర్కారు నుంచి అందే రూ. ముప్పై వేల ఫించన్‌ వారికి ఆసరాగా నిలుస్తోంది. ఇలాంటి ఎమ్మెల్యేలున్నారా... ఈ రోజుల్లో?