టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు : రేణుక దంపతులపై వేటు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీపీఎస్సీ) పోటీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితులైన రేణుక దంపతులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. ఈ కేసులో ఏ3 నిందితురాలుగా ఉన్న రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్‌లను ఉద్యోగాల నుంచి అధికారులు తొలగించారు. ఈ కేసులో రేణుకతో పాటు ఆమె భర్త ప్రమేయం ఉన్నట్టు తేలడంతో ఈ ఇద్దరిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగించారు.
వనపర్తి జిల్లా గురుకుల పాఠశాలలో రేణుక హిందీ టీచరుగా పని చేస్తున్నారు. డాక్యా నాయక్ వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో వీరిద్దరి ప్రమేయం ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో వారిద్దరిని అరెస్టు చేసిన పోలీసులు.. చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఈ పేపర్ లీకైనప్పటి నుంచి ప్రధాన సూత్రధారి ప్రణీణ్, రాజశేఖర్‌లతో పాటు రేణు, డాక్యా నాయక్ పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేయగా, ఇపుడు ప్రభుత్వ అధికారులు వారిద్దరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీచేశారు. కాగా, ఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 9 మందిని అరెస్టు చేశారు.