1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (17:43 IST)

క్యాంపస్‌లో తాగునీటి కోసం విద్యార్థుల ఆందోళన - చాంబర్‌లో బంధించిన ప్రిన్సిపాల్

kerala college principal
కేరళ రాష్ట్రంలో ఓ కాలేజీ విద్యార్థులను ఆ కాలేజీ ప్రిన్సిపాల్ తన చాంబర్‌లో బంధించారు. వారు చేసిన నేరం ఏంటంటే.. క్యాంపస్‌లో తాగునీరు కలుషితమవుతున్న విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లి సమస్యకు పరిష్కారం కనుగొనాలని కోరారు. అయితే, ఈ సమస్యను పరిష్కరించాల్సిన ప్రిన్సిపాల్.. వారి పట్ల కఠువుగా మాట్లాడి తన చాంబర్‌లోనే విద్యార్థులను బంధించారు. దీనిపై విద్యార్థుల ఫిర్యాదు మేరకు స్పందించిన ఆ రాష్ట్ర విద్యా మంత్రి కాలేజీ ప్రిన్సిపాల్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, కేరళ రాష్ట్రంలోని కాసరగోడ్ జిల్లాలో ఓ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఎం.రెమా పని చేస్తున్నారు. ఈ కాలేజీలో తాగు నీరు కలుషితమవుతున్నాయని, బాగుండటం లేదని ఆమెకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అయితే, ప్రిన్సిపాల్ సమస్యను పరిష్కరించకపోగా, విద్యార్థులతో కఠినంగా మాట్లాడారు. దీంతో ఆమె చాంబర్‌లోనే విద్యార్థులు నిరసనకు దిగారు. ప్రిన్సిపాల్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రిన్సిపాల్ విద్యార్థులను తన ఛాంబర్‌లోనే బంధించారు. 
 
ఈ వ్యవహారంపై రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ, విద్యా మంత్రికి విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఆర్.బిందు... విద్యార్థుల ఫిర్యాదు ఆధారకంగా ప్రిన్సిపల్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. రెమా స్థానంలో జియాలజీ విభాగం ఫ్యాకల్టీ ఏఎన్.అనంతపద్మనాభన్‌ను నియమించినట్టు తెలిపారు. అలాగే, కాలేజీలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు.