ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2017 (09:44 IST)

హైదరాబాద్ నడిబొడ్డున.. బుద్ధుడి సాక్షిగా నిర్ణయం తీసుకుంటా : రేవంత్

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో తీవ్ర మానసికక్షోభకు గురి చేశాయనీ ఆ కారణంగానే తాను పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు టీడీపీకి రాజీనామా చేసిన తెలంగాణ ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డి

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో తీవ్ర మానసికక్షోభకు గురి చేశాయనీ ఆ కారణంగానే తాను పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు టీడీపీకి రాజీనామా చేసిన తెలంగాణ ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. పైగా, పార్టీ మారాలని తాను నిర్ణయించుకున్న తర్వాత, తనను ఇంతకాలం ఆదరించిన చంద్రబాబునాయుడి ఆశీర్వాదం తీసుకుని వచ్చినట్టు తెలిపారు. తాను అమరావతిలో చంద్రబాబును కలిసి, మనసులోని మాట చెప్పానని, భవిష్యత్తులోనూ ఆయన అండ, దండ ఉండాలని కోరి వచ్చానని అన్నారు.
 
టీడీపీకీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సొంత నియోజకవర్గం కొండగల్‌కు చేరున్న రేవంత్ రెడ్డిని అభినందించేందుకు కలిసేందుకు భారీత స్థాయిలో కార్యకర్తలు, నేతలు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, "నేను అమరావతిలో చంద్రబాబునాయుడిని కలిసి, తెలంగాణలో ఉన్న పరిస్థితులను గురించి వివరించి, వారి ఆశీర్వాదం తీసుకుని, బెజవాడ కనకదుర్గమ్మకు దండం పెట్టుకుని కొడంగల్‌కు బయలుదేరి వచ్చినట్టు వెల్లడించారు. 
 
ఇవాళ కూడా కొడంగల్ గుడికెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకుని మీ ముందుకు వచ్చినా, మీ అందరు కూడా ఏదైతే తీర్మానం చేసిర్రో, ఏదైతే నా మీద అభిమానం ఉంచిర్రో, ఏదైతే నా మీద నమ్మకం, విశ్వాసాన్ని పెట్టిర్రో... మీ అందరి నమ్మకం, విశ్వాసం తగ్గకుండా ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో చంద్రశేఖరరావుకు గుణపాఠం చెప్పేలా, మీ ఆదేశాలు, ఆకాంక్షల మేరకు నడుచుకుంటా" అని చెప్పారు. 
 
అంతేకాకుండా, తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీకి, తనకు మధ్య ఆట మొదలైందన్నారు. 'ఓటుకు నోటు' కేసులో జైలుకు వెళ్లి, ఆపై బయటకు వచ్చిన రోజు చేసిన ప్రసంగంలో చెప్పిన మాటలనే, ఇపుడు కార్యకర్తల ఎదుట రేవంత్ మరోసారి గుర్తు చేశారు.
 
"ఆట మొదలైంది. ఆనాడు జైలు నుంచి వచ్చినప్పుడే చెప్పినా... ఆట మొదలైందని చెప్పి. నిజమైన ఆట ఇప్పుడు మొదలైంది. ఫైనల్స్‌కు వచ్చేసింది. రేప్పొద్దున పీపుల్స్ ప్లాజాకు రండి. నెక్లెస్ రోడ్డుమీద, హైదరాబాద్ నడిబొడ్డున, బుద్ధుడి ఎదురుగా నిర్ణయం తీసుకోనున్నా. ఆ నిర్ణయం ఈ రాష్ట్రంలో కేసీఆర్ పతనానికి నాంది పలకాలి. ఆ నిర్ణయం కేసీఆర్ దోపిడీని ఆపాలి" అని కార్యకర్తల ఈలలు, కేరింతల మధ్య రేవంత్ వ్యాఖ్యానించారు.