కదిలిన రేవంత్ రెడ్డి సైన్యం
జనమా ప్రభంజనమా అనే రీతిలో షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికాయి. పాలమూరు జిల్లాలో మంగళవారం సాయంత్రం నిరుద్యోగ, విద్యార్థి సమస్యల జంగ్ సైరన్ కార్యక్రమం సభకు తరలి వెళ్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి మధ్యాహ్నం షాద్ నగర్ పట్టణం నుండి వెళ్లారు.
నియోజకవర్గంలో ఆ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాహనాలు కాన్వాయ్ ఏర్పాటు చేశారు. వేలాది వాహనాలతో రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలకడం విశేషం. భారీ గజమాలను క్రేన్ సహాయంతో రేవంత్ రెడ్డికి ఆహ్వాన సత్కారాన్ని అందించారు. పట్టణంలో రేవంత్ రెడ్డి రోడ్ షో అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.
వాహనంలో రేవంత్ రెడ్డి ప్రజలకు అభివాదం చేసుకుంటూ పాలమూరు సభకు తరలి వెళ్లారు. షాద్ నగర్ రహదారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ వీర్లపల్లి శంకర్ ను తన వాహనంలో ఎక్కించుకుని సభకు బయల్దేరి వెళ్లారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సభ చేపట్టనున్న జంగ్ సైరన్ సభకు నియోజకవర్గం నుండి పదివేల మంది కార్యకర్తలకు పైగా 1వెయ్యి వాహనాలతో రేవంత్ రెడ్డి వెంట సైన్యంగా కదిలి వెళ్లారు.
కనీవినీ ఎరుగని రీతిలో పెద్దఎత్తున కాంగ్రెస్ శ్రేణులను వీర్లపల్లి శంకర్ సమీకరించారు. రేవంత్ రెడ్డి రాక సందర్భంగా అన్ని రహదారులు కిక్కిరిసిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రేవంత్ రెడ్డి సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేశారు. మరి కొందరు రేవంతన్న.. జై కాంగ్రెస్ అంటూ దారిపొడవునా కార్యకర్తలు నినాదాలు చేయడం విశేషం. రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ శ్రేణుల పూలవర్షం భారీగా కురిసింది.