శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 20 జనవరి 2021 (10:21 IST)

పిల్లల్ని పాఠశాలలకు పంపించటం పూర్తిగా తల్లిదండ్రుల నిర్ణయమే: సబిత

ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, పేరెంట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పలు అంశాలపై చర్చించారు.

కొవిడ్‌ దృష్ట్యా పాఠశాలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మంత్రి మార్గనిర్దేశం చేశారు. ఫీజులు లేనందున పాఠశాలలు నిర్వహించడం కష్టతరంగా మారిందని యాజమాన్యాలు పేర్కొన్నాయి. జూన్ వరకు విద్యా సంవత్సరం నిర్వహించాలని... కనీస హాజరు ఉండేలా నిబంధన పెట్టాలని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు.. సబితా ఇంద్రారెడ్డిని కోరారు. 
 
జీవో 46 ప్రకారం... 11 పాఠశాలలపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని... స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. చాలా పాఠశాలలు ఫీజుల విషయంలో నియమనిబంధనలు పాటించటం లేదని మంత్రికి ఫిర్యాదు చేశారు.

లాక్ డౌన్ కు ముందు బకాయి పడ్డ ఫీజులకు సంబంధించి యాజమాన్యాలు, తల్లిదండ్రులు ఒకరికొకరు సహకరించుకుని ముందుకువెళ్లాలని.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. పిల్లల్ని పాఠశాలలకు పంపించటం.. పూర్తి నిర్ణయం తల్లిదండ్రులదేనని మంత్రి స్పష్టం చేశారు.

శానిటైజేషన్‌ ఫీజుపై సమావేశంలో అభ్యంతరం వ్యక్తం కావటంతో.. ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.