ఆదివారం, 10 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 జులై 2022 (10:32 IST)

బోనాలు ఎప్పుడు మొద‌ల‌య్యాయి?-సీజ‌న‌ల్ వ్యాధుల నివార‌ణ‌కే ఈ బోనాలు..

bonalu
హైదరాబాద్ పాతబస్తీలో లాల్‌దర్వాజ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో వైభవోపేతంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. 
 
తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. లాల్ దర్వాజ బోనాలతో పాటు అంబర్‌పేట్‌లోనూ ఇవాళ అమ్మవారి బోనాలు జరుగుతున్నాయి. 
 
మేడ్చల్, రంగారెడ్డి పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ ప్రజలు బోనాల పండగ జరుపుకుంటున్నారు. లాల్ దర్వాజ్ సింహ వాహిని మహంకాళీ అమ్మవారికి వైఎస్ షర్మిల బోనం సమర్పించారు.  
 
సికింద్రాబాద్ రాంనగర్‌లోని పోచమ్మ దేవాలయాన్ని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అమ్మవారికి పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు.  
 
హైదరాబాద్‌ లోయర్ ట్యాంక్ బండ్ వద్దనున్న కట్టమైసమ్మ తల్లి ఆలయంలో ఇవాళ బోనాల పండగ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు వెల్లడించారు. 
 
ఇకపోతే.. బోనాల సంప్రదాయం.. చాలాకాలంగా ఆచారంలో వుంది. కొండ కోన‌ల్లో మ‌నిషి జీవించిన కాలంలో ఒక రాయిని దేవ‌త‌గా చేసుకుని ప్ర‌కృతి త‌న‌కు ఇచ్చిన ప‌త్రి, పువ్వు, కొమ్మ‌, ప‌సుపు కుంకుమ‌, నీళ్లు, ధాన్యం, కూర‌గాయ‌ల‌ను స‌మ‌ర్పించాడు. అప్పుడు ప్రారంభ‌మైన ఈ స‌మ‌ర్ప‌ణ‌మే బోనాల వ‌ర‌కు వ‌చ్చింది. 
 
పూర్వ కాలం నుంచే ఉన్న ఈ బోనాల‌కు ఒక్కో ప్రాంతంలో ఒక్కో చ‌రిత్ర ఉంది. ఆరు వంద‌ల ఏళ్ల నాటి ప‌ల్ల‌వ రాజుల కాలంలో తెలుగు నేల‌పై బోనాల పండుగ ప్రాశ‌స్త్యం పొందింద‌ని ప్ర‌తీతి.
 
15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవ‌రాలు ఏడు కోల్ల ఎల్ల‌మ్మ న‌వదత్తి ఆల‌యాన్ని నిర్మించి, బోనాలు స‌మ‌ర్పించార‌ట‌. 1676లో క‌రీంన‌గ‌ర్ హుస్నాబాద్‌లో ఎల్ల‌మ్మ‌గుడిని స‌ర్వాయి పాప‌న్న క‌ట్టించి, ఆ దేవ‌త‌కు బోనాలు స‌మ‌ర్పించిన‌ట్టు కైఫీయ‌తుల్లో గౌడ‌నాడులు గ్రంథంలో ఉంది. 
 
ఇక హైద‌రాబాద్ చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే.. 1869లో జంట‌న‌గ‌రాల్లో ప్లేగు వ్యాధి మ‌హ‌మ్మారిలా వ‌చ్చి ప్ర‌బ‌లడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
 
దైవాగ్ర‌హానికి గుర‌య్యామ‌ని భావించిన అప్ప‌టి ప్ర‌జ‌లు.. గ్రామ దేవ‌త‌ల‌ను శాంత‌ప‌రచ‌డానికి, ప్లేగు వ్యాధి నుంచి త‌మ‌ను తాము కాపాడుకోవ‌డానికి చేప‌ట్టిన క్ర‌తువే ఈ బోనాలు. 
 
1675లో గోల్కొండ‌ను పాలించిన ల‌బుల్ హాస‌న్ కుతుబ్ షా (తానీషా) కాలంలో బోనం పండుగ హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన‌ట్టు కూడా చ‌రిత్ర‌కారులు చెబుతుంటారు. ఈ సీజ‌న‌ల్ వ్యాధుల నివార‌ణ‌కు బోనాల పండుగ‌కు సంబంధం ఉంది. వేపాకు క్రిమినాశినిగా ప‌నిచేస్తుంది. 
 
అందుకే రోగ నిరోధ‌క‌త కోస‌మే ఇంటికి వేప తోర‌ణాలు క‌డ‌తారు. బోనం కుండ‌కు వేపాకులు క‌ట్ట‌డ‌మే కాకుండా.. బోనం ఎత్తుకున్న మ‌హిళలు వేపాకులు ప‌ట్టుకుంటారు. ప‌సుపు నీళ్లు చ‌ల్ల‌డం కూడా అందుకే మొద‌లైంద‌ని అంటారు.