తామర కాండల గుజ్జుతో.. ఉంగరంలో నుంచి దూరిపోయే పట్టుచీర..!
చేనేతకు పుట్టినల్లు సిరిసిల్ల సెగలో మరో నూతన ఆవిష్కరణ రూపుదిద్దుకుంది. అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరను తయారు చేసి తన తండ్రి ఆలోచనలకు ధీటుగా కొడుకు కూడా తనదైన ఆలోచనలతో వినూత్న తరహాలో సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాడు. దాని ఫలితమే ఉంగరంలో నుంచి దూరిపోయే పట్టుచీర.. దబ్బనంలోనూ దూరేలా అద్భుతమైన పట్టుచీరకు రూపకల్పన చేశాడు.
వివరాల్లోకి వెళితే.. సిరిసిల్ల పట్టణానికి చెందిన నల్ల పరంధాములు కుమారుడు నల్ల విజయ్ తన తండ్రి ఆలోచనలకు తగ్గట్లుగా ఈసారి కొత్త రూపంలో ఆవిష్కరించాడు. తామర ఆకు కాండం నుంచి గుజ్జును తీసి దాని ద్వారా వచ్చే నారను దారంగా మలచి పట్టుచీరను తయారు చేశాడు.
ఈ పట్టుచీరలో 50 శాతం పట్టుదారాన్ని 50శాతం నారను ఉపయోగించి మరమగ్గంపై చీర కొంగు భాగాన్ని అందంగా నేశాడు. ఈ చీరను మరమగ్గంపై తయారు చేయడానికి మూడు రోజులు పట్టగా.. తామర కాండల నుంచి దారాన్ని తీయడానికి రెండు నెలలు పట్టింది... ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని ఆవిష్కరణలను చేస్తానని విజయ్ చెబుతున్నాడు.