మంగళవారం, 31 జనవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated: మంగళవారం, 8 నవంబరు 2022 (10:26 IST)

నాగోలు వంతెనపైకి రాగానే ట్యాంకర్ లారీకి బ్రేకులు ఫెయిల్.. తర్వాత ఏమైంది?

nagole flyover bridge
హైదరాబాద్ నగరంలోని నాగోలు వంతెనపై ఓ ట్యాంకర్ లారీ రాగానే బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో ఆ ట్యాంకర్ లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో రెండు కార్లు, రెండు బైకులు ధ్వంసంకాగా, ఆరుగురు గాయపడ్డారు. 
 
స్థానికులు వెల్లడించిన కథనం మేరకు.. మల్లాపూర్ సాయినగర్‌కు చెందిన శ్రీను (25) అనే వ్యక్తి ఓ లారీ డ్రైవర్. నాచారంలోని ఓ కంపెనీలో పని చేస్తున్న అతను ట్యాంకర్ ద్వారా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఆయిల్ తరలిస్తుంటారు. 
 
రోజువారీలానే సోమవారం ఉదయం కూడా ఎయిర్‌పోర్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా నాగోలు ఫ్లైఓవర్ వద్ద ట్యాంకర్ లారీకి బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో అదుపు తప్పి లారీ ముందు వెళుతున్న రెండు కార్లు, రెండు బైకులను ఢీకొట్టింది. 
 
ఈ ఘటనలో కార్లు ధ్వంసం కాగా, అందులో ఉన్న జలా వెంకమ్మ (35), ఆమె కోడలు విజయ (35)లు గాయపడ్డారు. వెంకమ్మను ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా, ఈ ప్రమాదం జరగడం గమనార్హం. 
 
అలాగే బైకర్లు మర్రికంటి రమేష్, చెన్నకేశవులు గాయపడ్డారు. మరో బైకుపై వెళుతున్న కొత్తపేట గ్రీన్‌హిల్స్ కాలనీ జనప్రియ క్వార్టర్స్‌కు చెందిన కె.రాజశేఖర్, రమాదేవి దంపతులు కూడా గాయపడ్డారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యావ్తు జరుపుతున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.