పాము కూడా నటిస్తుందా? బాలుడిని కాటేసింది.. చివరికి?
పాము కాటు వేసి రెండు సంవత్సరాల బాలుడు మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అంతర్గం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బైరెడ్డి సంతోష్ అర్చన దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు నైతిక్ (2). చిన్నారి వేకువజామునే నిద్రలేచి పక్కింటావిడ వద్ద ఆడకుంటున్నాడు. అదే సమయంలో దగ్గరలో పాము కనిపించడంతో గ్రామంలో ఉన్నవారు దాన్ని కర్రలతో కొట్టారు.
ఆచేతనంగా పడి ఉండటంతో చనిపోయిందనుకున్న ఆ పామును పక్కకు జరిపారు. దీంతో దాన్ని చూడటానికి చాలా మంది పాముకు దగ్గర్లో గుమికూడారు.
అందులో బాబుని ఎత్తుకుని పక్కింటి మహిళ కూడా ఉంది. ఆమె చనిపోయిన పాముని గమనిస్తుండగా, ఒక్కసారిగా పైకి లేచిన పాము మహిళ చేతిలో ఉన్న చిన్నారిని కాటేసింది. ఈ ఘటనలో బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.