సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (10:50 IST)

సారీ, వాళ్లు నాపై అత్యాచారం చేయలేదు, 36 మంది మాత్రం: మిర్యాలగూడ యువతి

తనపై 139 మంది అత్యాచారం చేశారని సంచలన ఆరోపణలు చేసిన మిర్యాలగూడ బాధిత యువతి యు-టర్న్ తీసుకున్నది. తనపై ఎవరూ అత్యాచారం చేయలేదని, డాలర్ బోయ్ తనను చంపుతానని బెదిరించడం వల్ల అలా చెప్పాల్సి వచ్చిందని పేర్కొంది. ఐతే మళ్లీ మరోసారి మీడియా ముందుకు వచ్చింది.
 
సోమవారం నాడు హైదరాబాదులోని ప్రెస్ క్లబ్‌లో ఎరుకల సంఘం అధ్యక్షుడు కుమార్ అధ్యక్షతన పలు ప్రజాసంఘాలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... తనపై 139 మంది అత్యాచారం అంతా అబద్ధం, రాజశ్రీకర్ రెడ్డి అలియాస్ డాలర్ బోయ్ తనను చంపుతానని బెదిరించడం వల్ల అతడు చెప్పినట్లు చెప్పానని తెలిపింది. అంతేకాదు.. తనను అత్యాచారం చేసినట్లు పలువురు మీద నిందారోపణలు చేశాననీ, వారికి ఇబ్బంది కలిగించానని, వారికి మీడియా ద్వారా క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించింది. 
 
ఐతే తనపై 36 మంది అత్యాచారం చేశారని వెల్లడించింది. వారి పేర్లను పోలీసులకు అందించినట్లు తెలిపింది. తను ఉద్యోగం ద్వారా డాలర్ బోయ్ పరిచయమయ్యాడనీ, తనకంటే ముందే ఇద్దరిని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకున్నాడని చెప్పింది.
 
గతంలో తన మాట వినని వారిని ఎలా చంపాడో తెలుపుతూ వుండే ఫోటోలను తనకు చూపించి, అలాగే తనను కూడా చంపేస్తానని బెదిరించడంతో మరో మార్గం లేక ఇలా చెప్పానని వెల్లడించింది. డాలర్ బోయ్ ను శిక్షించాలని ఆమె డిమాండ్ చేసింది. అనంతరం ప్రజాసంఘాల నాయకులు కూడా యువతిని బెదిరించి, అఘాయిత్యాలకు పాల్పడ్డవారిని అరెస్టు చేయాలని, కేసును సీఐడికి అప్పగించాలని డిమాండ్ చేశారు.