శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2017 (09:30 IST)

స్వాతి మాస్టర్ స్కెచ్ : భర్తను చంపి.. ప్రియుడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి...

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్రషర్‌ వ్యాపారి సుధాకర్‌ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజేశ్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్రషర్‌ వ్యాపారి సుధాకర్‌ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజేశ్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రిలో కొల్లాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌, కేసు ప్రత్యేక అధికారి శ్రీనివాస్‌ అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రాజేష్ వద్ద జరిపిన విచారణలో సుధాకర్ హత్యకు కర్త, కర్మ, క్రియ అతని భార్య స్వాతియేనని వాంగ్మూలం ఇచ్చాడు. ఆమె వేసిన మర్డర్ ప్లాన్ ప్రకారమే అంతా జరిగిందని చెప్పుకొచ్చాడు.
 
దీనిపై పోలీసులు స్పందిస్తూ, రాజేశ్‌తో స్వాతికి వివాహేతర సంబంధం ఉందని చెప్పారు. ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్లిపోదామని రాజేశ్‌ చెప్పగా, పిల్లలను విడిచి రాలేనని స్వాతి చెప్పిందనీ, ఈ క్రమంలోనే సుధాకర్‌ రెడ్డిని హత్యచేసి, రాజేశ్‌ ముఖానికి ప్లాస్టిక్‌ సర్జరీ చేయించి, భర్త స్థానంలో ఇంటికి తీసుకురావాలని స్వాతి వ్యూహం రచించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
 
ప్లాన్‌ ప్రకారం ఇరువురు కలిసి సుధాకర్‌ రెడ్డిని ఇంట్లోనే హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. రాజేశ్‌ గాయాలు మానిపోయాయని డాక్టర్లు చెప్పడంతో, అతడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, భర్త సుధాకర్‌రెడ్డి అంటే స్వాతికి ఇష్టం లేదని రాజేశ్‌ తెలిపాడు. రెండేళ్లుగా స్వాతితో వివాహేతర సంబంధం ఉందన్నాడు. స్వాతియే హత్యకు ప్లాన్‌ చేసిందని చెప్పాడు. ఆమెపై వ్యామోహంతోనే సుధాకర్‌రెడ్డిని హత్యచేసినట్లు అంగీకరించాడు.