గవర్నర్ నరసింహన్‌కు తెలంగాణ వీడ్కోలు... ఉద్వేగానికి లోనైన దంపతులు
తెలుగు రాష్ట్ర మాజీ గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు శనివారం వీడ్కోలు పలికారు. ఆదివారం అంటే... సెప్టెంబర్ 8న తెలంగాణ కొత్త గవర్నర్‌గా తమిళైసాయి సౌందరాజన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో నరసింహన్‌కు వీడ్కోలు ఏర్పాటు చేశారు. సిఎం క్యాంప్ కార్యాలయంలో గవర్నర్ దంపతులకు సిఎం కెసిఆర్, మంత్రులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్, లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్, సీనియర్ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు, ఇతర అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ దంపతులను కెసిఆర్ ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ విడిచి వెళ్తున్నందుకు గవర్నర్ దంపతులు ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. అందరికీ వీడ్కోలు చెప్పిన గవర్నర్ దంపతులు 4 గంటలకు బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ దంపతులకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సిలు వీడ్కోలు చెప్పారు.
కాగా తన శేష జీవితాన్ని చెన్నై నగరంలో గడుపుతానని ఇప్పటికే నరసింహన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన తొమ్మిదన్నర ఏళ్లపాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలు అందించారు.