మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 ఆగస్టు 2021 (11:15 IST)

దళితుల్లో పేదరికం రూపుమాపే లక్ష్యంగా 16 నుంచి దళితబంధు

తెలంగాణా రాష్ట్రంలోని దళితుల్లో పేదరికం రూపుమాపే లక్ష్యంగా ఈనెల 16 నుంచి దళితబంధు పథకం హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభంకానుంది. ఈ దళితబంధు పథకానికి రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. పైగా, ఈ పథకానికి చట్టభద్రత కల్పిస్తూ... ప్రత్యేక చట్టం తేవాలని అభిప్రాయపడింది. 
 
లబ్ధిదారులు సమూహంగా ఏర్పడి ఎక్కువ మొత్తంలో పెట్టుబడితో పెద్ద యూనిట్ పెట్టుకునే అవకాశాన్ని కల్పించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. మిగతా గ్రామంతో సమానంగా అన్ని హంగులు ఉండేలా దళితవాడల్లో యుద్ధప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పన జరగాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 
 
దళితబంధు పథకం అమలు, విధి విధానాల రూపకల్పనపై రాష్ట్ర మంత్రివర్గం సుధీర్ఘంగా చర్చించింది. పథకం పూర్వాపరాలను సమావేశంలో వివరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ ప్రభుత్వం ముందుకుసాగుతోందని... ఆ ఫలితాలను ప్రజలు అనుభవిస్తున్నారని అన్నారు. 
 
దళితజాతి రూపురేఖలు మార్చేలక్ష్యంతో దళితబంధు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్న కేసీఆర్... రెక్కల కష్టం తప్ప మరే ఆస్తి లేని దీనస్థితిలో దళితులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకం సక్సెస్ అయితే, మిగిలిన నియోజకవర్గాల్లోనూ అమలు చేస్తామని ఆయన తెలిపారు