మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 జులై 2021 (17:55 IST)

బోర్డు పరిధిలోకి గోదావరి బేసిన్.. తప్పుబడుతున్న తెలంగాణ

గోదావరి బేసిన్‌ ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చుకోవడాన్ని తెలంగాణ తప్పుపడుతోంది. గోదావరి బేసిన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టులు లేవని, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి నీటిని విడుదల చేసే రెగ్యులేటర్లు లేక ఇరు రాష్ట్రాల మధ్య సంయుక్తంగా నిర్మించిన ప్రాజెక్టులు లేనందున దీని పరిధిని ఖరారు చేయ రాదని గతంలో కేంద్రానికి లేఖలు రాసింది.
 
రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 87 ప్రకారం గతంలో ఉన్న అవార్డులు, అంతర్రాష్ట్ర నదీ వివా దాల చట్టం - 1956 మేరకు ఏర్పడిన ట్రిబ్యునల్‌ల తీర్పులకు లోబడి కేంద్రం బోర్డుల పరిధిని నోటిఫై చేయాల్సి ఉంటుందని గుర్తు చేసింది. 
 
గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డులో ప్రాజెక్టులను బోర్డుల పరిధికి తీసుకోవడానికి సంబంధించి ఎలాంటి అంశాలు లేవని దృష్టికి తెచ్చింది. కొత్త మార్గదర్శకాలను తెలంగాణ, ఏపీలోని గోదావరి ప్రాజెక్టులపై రుద్దరాదని స్పష్టం చేసింది. అయినా దీని పరిధిపైనా గెజిట్‌ ఇచ్చేందుకే కేంద్రం మొగ్గు చూపింది.
 
మరోవైపు, బోర్డు పరిధి ఖరారైనందున కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉండదని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం కనీస స్థాయి కంటే దిగువన ఉన్నప్పటికీ తెలంగాణ సర్కార్‌ అక్రమంగా ఎడమ గట్టు కేంద్రంలో జూన్‌ 1నే విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. 
 
రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విద్యుదుత్పత్తిని నిలుపుదల చేయాలని కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. అయితే తెలంగాణ సర్కారు కృష్ణా బోర్డు ఉత్తర్వులను తుంగలో తొక్కుతూ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తిని చేపట్టింది.