కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమాకు హైకోర్టు షాక్
కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలిచి కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుకు తెలంగాణ హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. వనమా ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ సంచలన తీర్పునిచ్చింది. అదేసమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది.
గత 2018 నుంచి ఇప్పటివరకు వనమా ఎమ్మెల్యే పదవీకాలం చెల్లదని స్పష్టం చేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో వనమా తప్పుడు వివరాలను ఇచ్చారంటూ గత 2018లో జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుధీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు వనమా ఎన్నిక చెల్లదంటూ తీర్పును వెలువరించింది.
అంతేకాకుండా, ఎన్నికల అఫిడవిట్‌లో తప్పు సమాచారం ఇచ్చినందుకు రూ.5 లక్షల అపరాధం కూడా విధించింది. కాగా, గత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వనమా వెంకటేశ్వర రావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇపుడు ఆ ఎమ్మెల్యే పదవి పోయింది.