శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (15:08 IST)

సంక్రాంతి తర్వాత మూడో ముప్పు : హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు

వచ్చే రెండు నుంచి నాలుగు వారాల పాటు మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అత్యంత కీలకమని తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు అభిప్రాయపడ్డారు. అందువల్ల ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తతో, వ్యక్తిగత శ్రద్ధతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగించే అంశమన్నారు. అందువల్ల వచ్చే రెండు నుంచి నాలుగువారాల పాటు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. 
 
కరోనా వైరస్ కంటే ఒమిక్రాన్ వైరస్ ఆరు రెట్లు వేగంగా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిందని ఆయన గుర్తుచేశారు. అంటే సుమారుగా ఈ వ్యాప్తి 30 శాతంగా ఉండొచ్చని తెలిపారు. ఇప్పటికే బ్రిటన్, అమెరికా దేశాల్లో ఒమిక్రాన్ కేసులు లక్షల్లో దాటిపోయాయని గుర్తుచేశారు. అందువల్ల ప్రతి ఒకరూ జాగ్రత్తగా ఉంటూ కరోనా, ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి కట్టడికి సహకరించాలని ఆయన కోరారు. 
 
బుసలు కొడుతున్న ఒమిక్రాన్ 
ప్రపంచంలోని పలు దేశాలను వణికిస్తు ఒమిక్రాన్ వైరస్ మన దేశంలోనూ శరవేగంగా వ్యాపిస్తుంది. ఫలితంగా రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా చేసిన ప్రకటన మేరకు ప్రస్తుతం దేశంలో 961 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. వీటిలో ఢిల్లీలో 263, మహారాష్ట్రలో 252, రాజస్థాన్‌లో 69, గుజరాత్‌లో 97, కేరళలో 65, తెలంగాణాలో 62, తమిళనాడులో 45 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
మరోవైపు, కరోనా పాజిటివ్ కేసులు కూడా గత రెండు రోజులుగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. బుధవారం 13,154 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 268 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే మంగళవారం నమోదైన 9,155 కేసులతో పోల్చితే బుధవారం నమోదైన కోవిడ్ కేసుల్లో 40 శాతం పెరుగుదల కనిపించింది. సోమవారం ఈ కేసులు కేవలం 6,242 మాత్రమే కావడం గమనార్హం. 
 
మహారాష్ట్రలో అత్యధికంగా 3900 కేసులు వెలుగు చూడగా, కేరళలో 2846 కేసులు, బెంగాల్‌లో 1089 కేసులు, ఢిల్లీలో 923, తమిళనాడులో 739 చొప్పున కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈశాన్య రాష్ట్రం మినహా దేశ వ్యాప్తంగా 185 రాష్ట్రాల్లో కేసులు అంతకుముందు రెండు రోజులతో పోల్చితే రెట్టింపు కావడం గమనార్హం. 
 
ముంబైలో కరోనా విశ్వరూపం
దేశంలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిలో వేగం పెరిగింది. ఫలితంగా పలు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా, మహారాష్ట్రలో ఈ కేసుల పెరుగుల అధికంగా కనిపిస్తుంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల మేరకు గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో ఏకంగా 85 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 252కు చేరింది.
 
తాజాగా వెలుగు చూసిన కేసుల్లో అత్యధికంగా ఒక్క ముంబై మహానగరంలోనే 53 కేసులుగా ఉన్నాయి. పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్.ఐ.వి) పరిశోధనాశాలలో జరిపిన సీక్వెన్సింగ్ ఫలితాల్లో 47 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. 
 
అలాగే, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)లో 38 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఐఐఎస్ఈఆర్ నివేదికల్లో పాజిటివ్‌గా తేలిన 38 మందిలో ఎలాంటి ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ లేదని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. పూణె ల్యాబ్‌లో బయటపడిన 47 కేసుల్లో 43 మంది అంతర్జాతీయ ప్రయాణికులు కాగా, మూడు మాత్రం కాంటాక్ట్ కేసులని తేలింది.