ఆర్ఆర్ఆర్‌కు లైన్ క్లియర్... అల్లూరి, కొమరం భీమ్ చరిత్రను వక్రీకరించలేదు
ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా అల్లూరి సీతారామరాజు, కొమ్రం భీమ్ చరిత్రను వక్రీకరించారని, ఈ సినిమా ప్రదర్శన నిలిపివేయాలని అల్లూరి సౌమ్య తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే తాజాగా ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారించిన తెలంగాణ హైకోర్టు.. పిల్‌ను కొట్టివేసింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్‌ల ధర్మాసనం.. ఈ పిల్‌పై విచారణ చేపట్టింది. అల్లూరి సీతారామరాజును పోలీసుగా చూపి చరిత్రను వక్రీకరించారని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు.
అయితే అల్లూరి, కొమరం భీమ్‌లను దేశభక్తులుగానే చూపామని, ఆర్ఆర్ఆర్ కేవలం కల్పిత కథేనని దర్శక, నిర్మాతల తరఫున న్యాయవాది కోర్టుకు వివరించారు.
అంతేకాకుండా సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ కూడా జారీ చేసిందని గుర్తు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టేసింది. సినిమాతో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పేరు ప్రఖ్యాతలకు ఎలాంటి భంగం కలగలేదని హైకోర్టు అభిప్రాయపడింది.
జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా సినీ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటిష్ నటి ఒలివియా మోరిస్ నటించింది.
ఇటు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఓ ప్రత్యేక పాత్రలో నటించాడు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురాబోతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలాయళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.