నాలుగు బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం.. తర్వాత నిరవధిక వాయిదా
తెలంగాణ రాష్ట్ర శాసనసభ మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశంల కీలకమైన నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీ సహా నాలుగు చట్టాల సవరణ కోసం బిల్లులను సభలో ఆయా శాఖల మంత్రులు ప్రవేశపెట్టారు.
అనంతరం బిల్లులపై చర్చించి.. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. అనంతరం ఈ నాలుగు బిల్లులను ఆమోదిస్తున్నట్లు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కేవలం చట్టసవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలు కావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు.
ఇండియన్ స్టాంప్ బిల్లు(తెలంగాణ)2020, తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు(కన్వర్షన్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్)- 2020ను శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, జీహెచ్ఎంసీ సవరణ బిల్లు-2020ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లు - 2020ను న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రవేశపెట్టారు.
సభలో ఆమోదం పొందిన బిల్లుల వివరాలను పరిశీలిస్తే,
ఇండియన్ స్టాంప్ బిల్లు (తెలంగాణ) 2020 : భూముల ప్రాథమిక విలువ నిర్ధరణకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్లకు 47ఏ కింద విచక్షణాధికారాలను తొలగిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ చేశారు.
తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు(కన్వర్షన్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్)- 2020 : వ్యవసాయ భూములను వ్యవసాయేతరంగా బదలాయించేందుకు అధికారులకు విచక్షణాధికారాలు రద్దు చేశారు. ధరణి ద్వారానే ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేలా నాలా చట్టాన్ని సవరించారు. వ్యవసాయేతర ఆస్తులకు కూడా గుర్తింపు సంఖ్య ఇచ్చేలా చట్టానికి సవరణలు చేశారు.
జీహెచ్ఎంసీ సవరణ బిల్లు - 2020 : మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సవరణ చేశారు. 10 శాతం గ్రీన్ బడ్జెట్‌కు నిధుల కేటాయింపు. 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ల మార్పునకు సవరణ. నాలుగు రకాల వార్డు వాలంటీర్ల కమిటీల ఏర్పాటుకు సవరణ. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని ఎస్ఈసీని సంప్రదించాలని చట్ట సవరణ.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లు - 2020 : హైకోర్టు సూచన మేరకు నిందితులకు పూచీకత్తు అంశానికి సంబంధించిన సీఆర్పీసీ చట్టాన్ని సవరించారు.
ఈ బిల్లులకు ఆమోదం తెలిపన తర్వాత తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. మంగళవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన శాసనసభ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. కేవలం చట్ట సవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలు కావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు.