బాలికను లేపుకెళ్లిన పూజారీ.. వంద రోజుల తర్వాత గుర్తింపు!
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక కిడ్నాప్‌కు గురైంది. ఈ సంఘటన గత ఏడాది డిసెంబర్ 17వ తేదీన జరిగింది. ఈ కిడ్నాప్ కేసులోని మిస్టరీని పోలీసులు వంద రోజుల తర్వాత ఛేదించారు. ఆ బాలికను ఓ పూజారి మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లారని, ప్రస్తుత యూపీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లకు చెందిన ఓ వ్యక్తికి మూఢనమ్మకాలు ఎక్కువ. తన ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయన్న అనుమానంతో ఓ పూజారిని తీసుకొచ్చి కొన్ని రోజులుగా ఇంట్లో క్షుద్రపూజలు చేయించాడు. ఆ సమయంలోనే అతడి మేన కోడలు ఆయన ఇంట్లోనే ఉంటోంది.
ఈ క్రమంలోనే బాలిక అనారోగ్యానికి గురైంది. ఆమె కోలుకోవాలంటే గుంటూరులోని ఓ ఆలయంలో పూజలు చేయాలని చెప్పిన పూజారి ఇంట్లో వారందరినీ అక్కడకు పంపించాడు. ఇంట్లో ఆ మైనర్ బాలిక మాత్రమే ఉంది. దీంతో ఆమెకు పూజారి మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. ఆమె కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె కనిపించలేదు.
దీంతో బాలిక అదృశ్యంపై పోలీసులకు ఆమె తల్లి ఫిర్యాదు చేసింది. బాలిక మేనమామ ఇంట్లో క్షుద్రపూజల ఆనవాళ్లను గుర్తించారు. ఆ ఇంట్లో పెద్దగొయ్యి తవ్వి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఈ కోణంలో దర్యాప్తు చేపట్టగా పూజారే ఆమెను అపహరించి తీసుకెళ్లాడని చివరికి తేల్చుకుని ఉత్తరప్రదేశ్‌లో ఆమెను గుర్తించారు.