తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం... సీఎం కేసీఆర్ స్పీచ్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొంతకాలం క్రితం మృతిచెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు శాసనసభ నివాళులర్పించింది. సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాయన్న లేని లోటు పూడ్చలేనిదన్నారు.
కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో కలపాలని ఆయన పరితపించారని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సాయన్న సేవలను కొనియాడారు. అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది.
మరోవైపు శాసన మండలిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన ఆస్తినష్టం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై మండలిలో సభ్యులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికలకు ముందు జరిగే చిట్టచివరి సమావేశాలుగా వీటిని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో అధికార భారాసతో పాటు విపక్షాలైన కాంగ్రెస్, భాజపాలు కూడా కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పరస్పర విమర్శలు, ఆరోపణలు ఇప్పటికే హోరెత్తుతున్నాయి. ఈసారి సభాపర్వంలో కూడా ఆ వేడి, వాడి కనిపించే అవకాశముంది.