బీఆర్ఎస్‌కు షాకివ్వనున్న తీగల కృష్ణారెడ్డి
ఈ యేడాది ఆఖరులో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందు పలువురు అధికార తెరాస పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అమితాసక్తి చూపుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. తాజాగా మరో తెరాస నేత కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత, మహేశ్వరం మాజీ శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు. తన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ అనితారెడ్డితో కలిసి తీగల కృష్ణారెడ్డి హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో తీగల కృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ మేరకు కారు దిగి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.
తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రయాణం ప్రారంభించిన తీగల.. హైదరాబాద్ మేయర్‌గా పనిచేశారు. అనంతరం హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) ఛైర్మన్‌గా పనిచేశారు. హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా పనిచేసిన తీగల 2009లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడినప్పుడు తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డిపై తెదేపా తరఫున పోటీ చేసి గెలుపొందారు. అనంతరం తెరాసలో చేరిన తీగల.. 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.