శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 అక్టోబరు 2023 (11:15 IST)

అమెరికాలో గుండెపోటుతో తెలుగు విద్యార్థి మృతి

deadbody
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి గుండెపోటుకు గురై మృత్యువాతపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మృతుని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మృతుడిని మెదక్ జిల్లా మనోహరాబాద్ ప్రాంతానికి చెందిన వినీత్‌గా గుర్తించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ నెల 18న న్యూయార్క్ కాలమానం ప్రకారం ఉదయం 7 గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తూ వినీత్ అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. ప్రాణాలు కోల్పోయి రోడ్డుపై పడివున్న అతడిని అక్కడి పోలీసులు గుర్తించి మార్చురీకి తరలించారు. కొన్ని రోజులపాటు వినీత్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. 
 
ఏం జరిగిందో తెలుసుకోవాలంటూ వినీత్ స్నేహితుడైన తమిళనాడుకు చెందిన పళని అనే విద్యార్థికి సమాచారం ఇచ్చారు. అతడు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హార్ట్ అటాక్ (కార్డియాస్ట్రోక్) మృతి చెందిన ఓ భారతీయుడి మృతదేహం మార్చురీలో ఉందని తెలపడంతో వెళ్లి చూసిన పళని అతను వినీత్ అని గుర్తించాడు.
 
కొడుకు మరణవార్త విన్న వినీత్ తల్లిదండ్రులు గడ్డం బాలేశం, వరలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాలేశం కుటుంబం మనోహరాబాద్ ప్రాంతానికి చెందినవారు. జీవనోపాధి కోసం హైదరాబాద్ వలస వచ్చారు. బోయినపల్లిలోని హనుమాజీ కాలనీలో నివాసముంటున్నారు. తండ్రి క్యాబ్ డ్రైవర్ కాగా, తల్లి ఓ దుకాణంలో రోజువారీ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. 
 
అప్పులు చేసి మరీ కొడుకుని అమెరికా పంపిస్తే ఇలా జరిగిందని వాపోతున్నారు. కాగా మృతదేహం తరలింపునకు సాయం చేయాలంటూ కేంద్రమత్రి కిషన్ రెడ్డి, మరో ఇద్దరు మంత్రులకు కుటుంబ సభ్యులు విజ్ఞప్తిచేశారు. తమిళనాడు అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ వారు ఏర్పాట్లు చేయడంతో మృతదేహాన్ని తరలిస్తున్న ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో శుక్రవారం అర్థరాత్రి బయలుదేరింది.