మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 14 జులై 2021 (21:47 IST)

ఆ వృద్ధ దంపతులు రోడ్లు బాగు చేస్తుంటే మీకెందుకు జీతాలు: GHMCపై హైకోర్టు

గంగాధర్ తిలక్ దంపతులు రోడ్లపై గుంతలను పూడుస్తున్న అంశంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఫించను డబ్బుతో తిలక్ దంపతులు గుంతలు పూడుస్తున్నారన్న మీడియాలో కథనంపై విచారణ చేసింది. వృద్ధ దంపతులు రోడ్లు మరమ్మతులు చేస్తుంటే జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించింది.
 
రోడ్ల దుస్థితి చూడలేక వృద్ధ దంపతులు నడుం బిగించడం జీహెచ్ఎంసీకి సిగ్గుచేటని, జీహెచ్ఎంసీ అధికారుల వేతనాలను తిలక్ దంపతులకు ఇవ్వడం మేలని అభిప్రాయపడింది. పనిచేయనప్పుడు జీహెచ్ఎంసీకి బడ్జెట్ తగ్గించడం మంచిందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
 
ప్రమాదాల్లో ప్రాణాలు పోతుంటే.. వాహనాలు దెబ్బతింటుంటే చూస్తూ కూర్చున్నారా? అంటూ ప్రశ్నించింది. నగరంలో అద్భుతమైన రోడ్లను నిర్మిస్తున్నామని జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది చెప్పగా, రోడ్లపై గుంతలే లేవా.. న్యాయవాదులతో తనిఖీలు చేయించమంటారా అంటూ ప్రశ్నించింది.
 
వర్షాకాలంలో దెబ్బతినే రోడ్ల మరమ్మత్తు కోసం ప్రణాళికలేంటని జీహెచ్ఎంసీని ప్రశ్నించిన హైకోర్టు, జోన్ల వారీగా జోనల్ కమిషనర్లు, ఎస్ఈలు నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ వారం రోజులకు వాయిదా వేసింది.