గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 26 జూన్ 2020 (11:23 IST)

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఒకరు తీవ్రంగా గాయపడిన ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కాశీంపేట వద్ద  శుక్రవారం ఉదయం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌ లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన మైదాబత్తుల విజయకుమారి(60) క్యాన్సర్‌ చికిత్స కోసం హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రికి కుటుంబసభ్యులతో కలిసి కారులో బయలుదేరారు.

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కాశీంపేట వద్దకు రాగానే ..హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న సిమెంట్‌ ట్యాంకర్‌ అకస్మాత్తుగా మలుపు తిరగడంతో వెనుక  వస్తున్న కారు అదుపుతప్పి ట్యాంకర్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో విజయకుమారితోపాటు ఆమె భర్త సత్యానందం(70), కుమారుడు జాన్‌ జోసెఫ్‌(35) అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్‌ విజయవాడకు చెందిన అవినాశ్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

గమనించిన స్థానికులు క్షతగాత్రుడ్ని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.