టాలీవుడ్‌ను కుదిపేస్తున్న రేవ్ పార్టీలు.. డ్రగ్స్ పార్టీలో సినీ ఫైనాన్షియర్ అరెస్టు
తెలుగు చిత్రపరిశ్రమను రేవ్ పార్టీలు, ఆ పార్టీల్లో ఉపయోగించే మాదకద్రవ్యాలు కుదిపేస్తున్నాయి. గతంలో ఒకసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపడమే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇపుడు అలాంటి ఘటనే మరోమారు వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీఎస్ న్యాబ్) పోలీసుల దాడిలో సినీ ఫైనాన్షియర్ వెంకటరత్నారెడ్డి పట్టుబడటం ఇప్పుడు సంచలనంగా మారింది.
వెంకటరత్నారెడ్డి డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు వెలుగులోకి రావడం, మరో నిందితుడు బాలాజీ నేరుగా సినీ పరిశ్రమలోని ముఖ్యులకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలడం చర్చనీయాంశమైంది. ఈ ఏడాది జూన్‌లో 'కబాలి' తెలుగు చిత్ర నిర్మాణ కేపీ చౌదరి అరెస్టు.. పరిశ్రమలో అతని సంబంధాలపై విస్తృత ప్రచారం జరగడం.. మరువకముందే తాజా వ్యవహారం తెరపైకొచ్చింది.
తాజా కేసులో నిందితుల ఫోన్లను విశ్లేషించిన పోలీసులు ఛాటింగ్, ఇతర కాల్స్ తదితర ఆధారాలతో కొందరి పేర్లను గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ 18 ఎవరన్నదానిపై చర్చ సాగుతోంది. ఈ 18 వినియోగదారులకు కొకైన్, ఎక్స్‌టీసీ మాత్రలు సరఫరా చేసినట్లు గుర్తించారు. వీరంతా ఎవరెవరో ప్రాథమికంగా జాబితాను సిద్ధంచేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ప్రముఖులు సైతం ఉన్నారని పోలీసులు కొంత బాహాటంగానే ప్రకటించడం గమనార్హం.