తెరాస ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్... సెల్ఫ్ క్వారంటైన్‌కు ఎమ్మెల్సీ కె.కవిత
తెలంగాణ రాష్ట్రంలో అధికార తెరాస పార్టీకి చెందిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన చేసిన ట్వీట్‌లో... "పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, ప్రజలకు, నాయకులకు మనవి. నాకు రాపిడ్ టెస్టులో నెగటివ్ రాగా, ఆర్టీపీసీఆర్ టెస్టులో కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయినందున గత ఐదు రోజులుగా నాతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్‌తో పాటు కోవిడ్ పరిక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను" అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
దీంతో తెరాస ఎమ్మెల్యేగా విజయభేరీ మోగించిన కల్వకుంట్ల కవిత కూడా ఐదు రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆమె ప్రకటించారు. సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎలెక్షన్ కౌంటింగ్ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను ఆమె కలిశారు.
తాజాగా ఆయనకు కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. గత ఐదు రోజులుగా తనతో కాంటాక్ట్‌లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ హోమ్ ఐసొలేషన్ కు వెళ్లాలని, కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు.
దీనిపై కవిత స్పందిస్తూ, 'అన్నా మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. నేను మిమ్మల్ని కలిసిన నేపథ్యంలో హోం క్వారంటైన్‌కు వెళ్తున్నా. ముందు జాగ్రత్త చర్యగా ఐదు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటా. కొన్ని రోజుల పాటు పార్టీ శ్రేణులు ఎవరూ నా కార్యాలయానికి రావద్దని కోరుతున్నా' అని కవిత ట్వీట్ చేశారు.