హిందువుల ఇళ్లనే జీహెచ్ఎంసీ అధికారులు టార్గెట్ చేశారు : బండి సంజయ్
గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) అధికారులపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. భాగ్యనగరిలో హిందువుల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారంటూ మండిపడ్డారు. అదేసమయంలో ముస్లిం ప్రభావిత ప్రాంతాలకు మినహాయింపు ఇస్తున్నారని విమర్శించారు.
ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలోని పలు అక్రమ నివాసాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. వీటిపై బండి సంజయ్ స్పందించారు. జీహెచ్ఎంసీ అధికారులు, మేయర్ కలిపి అక్రమ కట్టడాలు కూల్చివేయాలని నిర్ణయించి కేవలం హిందువుల ఇళ్లను మాత్రమే టార్గెట్ చేస్తున్నారంటూ ఆరోపించారు.
కేవలం హిందువుల ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమన్నారు. ఎంఐఎం శాసనసభ్యుల ప్రాంతాలైన చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్లకు మినహాయింపు ఇవ్వడం అన్యాయమని విమర్శించారు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఎంఐఎం శాసన సభ్యుల నియోజకవర్గాలు అంటే ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలన్నారు. వీటిని మినహాయింపు ఇచ్చి అక్రమ నిర్మాణాల పేరిట కూల్చివేతలు కొనసాగిస్తున్నారన్నారు. ఇది ఒక రకంగా మెజారిటీలపై ప్రభుత్వం చేస్తున్న దాడిగా ఆయన అభివర్ణించారు.