శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 ఏప్రియల్ 2021 (11:36 IST)

ఫీజు చెల్లించినవారే పాస్ ... క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కారు

తెలంగాణ రాష్ట్రం పాఠశాలలకు, జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించింది. మంగళవారం నుంచి మే 31 వరకు సెలవులను ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఇంటర్‌ విద్య కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. 
 
ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి జనవరిలో ప్రకటించిన అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం.. పదోతరగతి పరీక్షలు మే 27 నుంచి జరగాల్సి ఉంది. అలాగే వేసవి సెలవులు మే 27 నుంచి జూన్‌ 13 వరకు 17 రోజులు మాత్రమే ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. కానీ పదోతరగతి పరీక్షలు రద్దవడం, కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. సెలవులను నెలరోజుల ముందే ప్రకటించారు. దీంతో ఈసారి వేసవి సెలవులు 35 రోజులు ఉండనున్నాయి. 
 
సాధ్యమైనంత త్వరగా ఆన్‌లైన్‌ తరగతులు కూడా ప్రారంభిస్తామని ప్రభుత్వం పేర్కొంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టి.. సాధారణ పరిస్థితులు నెలకొంటే జూన్‌ 1 నుంచి తదుపరి విద్యాసంవత్సరం ప్రారంభంకానుంది. లేనిపక్షంలో సెలవులు పొడిగించవచ్చు. దీనిపై జూన్‌ 1న ప్రభుత్వం సమీక్షించి నిర్ణయం తీసుకోనుంది. 
 
అలాగే జూనియర్‌ కాలేజీలకూ రేపట్నుంచి మే 31 వరకు సెలవులు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 404 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల సిబ్బంది పనిదినాలు ఏప్రిల్‌ 15కే ముగిసినా.. వీటిని ఏప్రిల్‌ 30వరకు పొడిగించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులు సమర్పించాల్సిన అసైన్‌మెంట్లన్నీ అందటంతో వీరికి సెలవులను 4 రోజుల ముందుగా ప్రకటించారు. 
 
అయితే, గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పదోతరగతి విద్యార్థులందరూ పరీక్షల్లేకుండా ఉత్తీర్ణత సాధించారు. కేంద్రం సీబీఎస్ఈ  విద్యార్థులకు ప్రకటించిన విధంగానే, రాష్ట్రంలోనూ ఆబ్జెక్టివ్‌ ప్రమాణాలను పాటిస్తూ పదోతరగతి ఫలితాలు ప్రకటిస్తామని పరీక్షల రద్దు సందర్భంగా ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. 
 
అయితే ఈ విధానంలో విద్యార్థులు ఫెయిలయ్యే అవకాశాలపైనా చర్చ జరిగింది. దీనిపై ప్రభుత్వం ఆదివారం స్పష్టత ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి పరీక్ష రాయడానికి ఫీజు చెల్లించిన మొత్తం 5,21,392 మంది విద్యార్థులూ పాసయినట్టే అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.