హైదరాబాద్ నగరంలో మృత్యుక్రీడ... ఒక్క రోజే 115 మంది మృతి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి హద్దులుదాటిపోయింది. ముఖ్యంగా, హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ మహానగరంలోని ప్రధాన ఆస్పత్రులైన గాంధీ, టిమ్స్ ఆస్పత్రుల్లో ఒక్కరోజు వ్యవధిలోనే 115 మంది మృత్యువాత పడ్డారు.
శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు గాంధీ ఆస్పత్రిలో 75 మంది, గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో 40 మంది కరోనాతో మృతి చెందినట్లు సమాచారం. గాంధీలో గడచిన మూడు రోజుల్లో 205 మంది మహమ్మారికి బలైనట్లు, శుక్రవారం 62 మంది, శనివారం 68, ఆదివారం 75 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. రోజూ సుమారు 40 నుంచి 75 మంది వరకుప్రాణాలు కోల్పోతున్నట్లు సమాచారం.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలతోపాటు నగరంలోని పలుప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనాతో చేరిన వారంతా పరిస్థితి విషమించాక ఆఖరి నిమిషంలో గాంధీ ఆస్పత్రికి వస్తునట్లు అస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. వారిని కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా, అప్పటికే పరిస్థితి చేయిదాటి పోవడంతో మృతుల సంఖ్య పెరుగుతోందని అంటున్నారు.
మృతుల్లో దీర్ఘకాలిక వ్యాధులతో చికిత్స పొందుతున్న వారు ఎక్కువగా ఉంటున్నట్లు పేర్కొంటున్నారు. గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిలో ఆక్సిజన్, మందులు, బెడ్ల కొరత లేనప్పటికీ.. సిబ్బంది కొరత ప్రధాన సమస్యగా మారింది. దీంతో మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఆదివారం ఒక్కరోజే టిమ్స్‌లో 40 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ ఆస్పత్రిలో గత మూడు రోజుల నుంచి రోజుకు 30 నుంచి 35 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం టిమ్స్‌లో 600 మంది కరోనా రోగులు ఉండగా, వీరిలో 100 మంది ఐసీయూలో వెంటిలేషన్‌పై చికిత్స పొందుతున్నారు. మిగతావారు స్వల్ప ఆక్సిజన్‌తో చికిత్స తీసుకుంటున్నారు.