శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 మార్చి 2023 (16:19 IST)

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో స్టేటస్ రిపోర్టు ఇవ్వండి... తెలంగాణ హైకోర్టు

Court
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పోటీ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసులో స్టేటస్ రిపోర్టును సమర్పించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
ఈ పోటీ పరీక్షల పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు సక్రమంగా జరగలేదనే వాదనకు పిటిషనర్‌ సరైన ఆధారాలు సమర్పించలేదని కోర్టు అభిప్రాయపడింది. అదేసమయంలో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినపిస్తూ, 'రాజకీయ దురుద్దేశంతో వేసిన పిటిషన్‌ ఇది. లీకేజీ కేసులో సిట్‌ సమగ్రంగా దర్యాప్తు జరుపుతోంది. కేవలం ఇద్దరినే అరెస్టు చేశారని పిటిషనర్లు అంటున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేశారు' అని కోర్టుకు వివరించారు.
 
ఇరు వర్గాల వాదనలు ఆలకించిన కోర్టు.. లీకేజీ కేసుకు సంబంధించిన స్టేటస్‌ రిపోర్టును సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్టేటస్‌ రిపోర్టు సమర్పణకు ప్రభుత్వానికి 3 వారాల గడువును విధించిన న్యాయస్థానం.. ఈ కేసులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను ఏప్రిల్‌ 11వ తేదీకి వాయిదా వేసింది.