మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 19 మే 2020 (05:39 IST)

2 లక్షల ఎకరాల్లో కూరగాయలు: కేసీఆర్‌

తెలంగాణలో మే 31 వరకు లాక్‌డౌన్‌ ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. తెలంగాణలో కంటైన్‌మెంట్‌ జోన్లు మినహాయించి మిగిలినవన్నీ గ్రీన్‌ జోన్లుగా పరిగణించనున్నామని తెలిపారు.

‘కరోనాకు వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు. కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి. బతుకును బంద్ పెట్టుకుని జీవించలేము.హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాల్లో అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చు. హైదరాబాద్ లో సరి ,బేసి విధానంలో దుకాణాలు తెరవాలి. హైదరాబాద్ సిటీ బస్సులు నడవవు. తెలంగాణ జిల్లాల్లో బస్సులు నడుస్తాయి.

ఆటోలు, కార్లు నడుస్తాయి. సెలూన్లు తెరుచుకోవచ్చు. కంటైన్మెంట్ ఏరియాల్లో మాత్రం సెలూన్లు తెరవొద్దు.ఆర్టీసీ కోవిడ్ నిబంధనల మేరకు నడుస్తాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కదా అని ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే మళ్లీ పూర్తిస్థాయిలో లాక్‌ డౌన్‌ విధించే అవకాశం ఉంటుంది.

స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష :
బార్లు, క్లబ్బులు, జిమ్ములు, పార్కులు బంద్ ఉంటాయి. మెట్రో రైలు నడవదు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. షాపు ఓనర్స్ శానిటైజర్లను తప్పనిసరి ఉంచాలి. 65 ఏళ్ల పైన ఉన్న వృద్ధులను, పిల్లలను బయటకు రానివ్వొద్దు. తక్కువ సమయంలో బయట పడతాం. స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష’ అని కేసీఆర్‌ అన్నారు.

ఇష్టం వచ్చినట్లు చేస్తే రైతు బంధు వర్తించదు :
‘అన్ని రకాల పంటలకు తెలంగాణ అనుకూలం. తెలంగాణలో ఈ ఏడాది భారీగా వరి దిగుబడి సాధించాం. రైతుబంధు ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు. వ్యవసాయానికి ఫ్రీగా వాటర్ ఇస్తూ, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. 2604 వ్యవసాయ క్లస్టర్లు ఏర్పాటు చేశాం. కల్తీ విత్తన వ్యాపారులపై పీడీ యాక్ట్ పెట్టాం. పంటల ఉత్పత్తిలో తెలంగాణ ముందుంది. తెలంగాణలో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలి.

నలభై లక్షల ఎకరాల్లో వరి వేద్దాం. డిమాండ్ ఉన్న వాటిని మేము కనిపెట్టాం. వర్షాకాలంలో మొక్క జొన్న వేయొద్దు. మొక్క జొన్న ప్రతీసారి ప్రభుత్వం కొనలేదు. యాసంగిలో మొక్కజొన్న వేద్దాం. వర్ష కాలంలో 15 లక్షల ఎకరాల్లో కందులు వేయండి. కంది పంట మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. 2 లక్షల ఎకరాల్లో కూరగాయలు వేద్దాం.

ఎండు మిర్చి రెండున్నర లక్షల ఎకరాల్లో సాగు చేద్దాం. వరి ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వేయొద్దు. ఇష్టం వచ్చినట్లు సాగు చేస్తే రైతు బంధు పథకం వర్తించదు. రిపోర్ట్ తెప్పించుకుని రైతు బంధు ఇస్తాం. షుగర్ ఫ్రీ రైస్ తెలంగాణ సోనా వరి వేరైటీకి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉంది. 10 లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా సాగు చేద్దాం’ అని కేసీఆర్‌ అన్నారు.